
అక్షర ఆయుధం : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. హుజురాబాద్‌లో సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుకు సంబంధించి పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. BNSSలోని సెక్షన్ 35(3) కింద నోటీసు ఇచ్చారు. ఏప్రిల్ 4న ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్‌లో విచారణకు రావాలని నోటీసులు పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి తన గుర్తింపు కార్డు, సంబంధిత పత్రాలతో సహా సీఐడీ ఎదుట హాజరు కావాలని, అలాగే దర్యాప్తునకు సహకరించాలని ఎమ్మెల్యేను స్పష్టం చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేయవద్దని అధికారులు హెచ్చరించారు. తమ ఆదేశాలను పాటించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. తనకు సీఐడీ నోటీసులు జారీ చేయడంపై కౌశిక్ రెడ్డి స్పందించారు. ఏ తప్పు చేయకపోయినా… ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో తనకు, తనకు కుటుంబానికి, తన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు సీఐడీ నోటీసులు ఇవ్వడం ఎంతో బాధ కలిగించిందని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కారణంతో తన కుటుంబ సభ్యులను , తమ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇలా బెదిరింపులకు గురిచేయడం తగునా? అని ప్రశ్నించారు. రాజకీయాలు తనపై చేయాలని... కానీ తన కుటుంబాన్ని, తమ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం? అని అడిగారు.‘‘సీఎం రేవంత్ రెడ్డి... నన్ను లక్ష్యంగా చేసుకోండి... నాపై కేసులు పెట్టండి... నాకు నోటీసులు ఇవ్వండి... కానీ నా కుటుంబాన్ని, నా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం మాత్రం బాధాకరం. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని నోటీసులు ఇచ్చినా నేను వెనక్కి తగ్గను. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు… ప్రజల తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాను.నిలదీస్తూనే ఉంటాను. ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు… ప్రజల కోసం చేసే బాధ్యత. ప్రశ్నించే గొంతును అణచలేరు… ప్రజల కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’’ అని ఎక్స్‌లో చేసిన పోస్టులో కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.ఇక, హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండల కేంద్రంలోని సమ్మక్క- సారలమ్మ జాతరకు ట్రస్టీగా ఉన్న పాడి ఉదయానందరెడ్డి వర్గానికి కౌశిక్‌రెడ్డి వర్గానికి విభేదాలు సాగుతున్నాయి. అయితే ఈ ఏడాది వీణవంకలో జాతర జరిగే సమయంలో భారీ కాన్వాయ్‌తో వెళ్తున్న కౌశిక్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. జాతర నిర్వహణపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో పరిమిత వాహనాలనే అనుమతిస్తామని చెప్పారు. దీంతో కౌశిక్ రెడ్డి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి, ఆయన భార్య, కూతురు, బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ - కరీంనగర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.