
పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలో ఆహార కల్తీని నియంత్రించడానికి ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలో ఆహార కల్తీని నియంత్రించడానికి ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన ఈగల్, హైడ్రా తరహాలోనే ఆహార కల్తీని నియంత్రించడానికి కూడా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం దేశంలో ప్రస్తుతం అమలవుతున్న కల్తీ నిరోధక చట్టాలను అధ్యయనం చేసి పటిష్టమైన చర్యలు చేపడుతామని చెప్పారు. రాష్ట్రంలో సన్న బియ్యం పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు శాసనసభ సెంట్రల్ హాలులో సన్నబియ్యంతో భోజనం ఏర్పాటు చేశారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొని భోజనం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మీడియాతో ముచ్చటిస్తూ... రేషన్ షాపుల ద్వారా దొడ్డుబియ్యం అందించినా తినేవారు లేకపోవడంతో ఆ బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చే మాఫియా పెరిగిపోయిందని అన్నారు. పైగా దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు తప్ప పేదలకు ఉపయోగపడటం లేదని చెప్పారు. అన్ని రకాలుగా ఆలోచనలు చేసిన తర్వాత పేదలు తినగలిగే సన్నబియ్యం అందించాలని ఈ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలోని 86 శాతం ప్రజలు సన్నబియ్యం పొందుతున్నారని చెప్పారు. ఇందుకోసమే క్వింటాలుకు రూ. 500 బోనస్ ప్రకటించి సన్నవడ్లు పండించాలని రైతులను ప్రోత్సహించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అడిగిన ప్రతి వారికి రేషన్ కార్డు జారీ చేశామని... ఇదే తరహాలో రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ క్రమంలో పంట మార్పిడి విధానాలపై రైతుల్లో అవగాహన కల్పిస్తామని తెలిపారు. సన్నబియ్యం పంపిణీతో బ్లాక్ మార్కెట్ మాఫియా తగ్గిందని అన్నారు. రైతులను వాణిజ్య, ఇతర పంటలవైపు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇదిలాఉంటే, సీఎం రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ... నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 50 శాతం సీట్లు పెంచితే, దక్షిణ భారతదేశానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం చెలాయిస్తుందని... దక్షిణాదిలో ఒక్క సీటు రాకున్నా కేంద్రంలో సర్కారు ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రతిపక్షాల విమర్శలే తనను మరింత బలోపేతం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రావణాసురుడు ఉండటం వల్లే శ్రీరాముడికి ప్రాధాన్యత దక్కిందని అన్నారు. శకుని లేకుంటే శ్రీకృష్ణుడికి అంత గుర్తింపు ఉండేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఉండటం వల్లే రేవంత్ రెడ్డికి ఈ స్థాయిలో పేరు వచ్చిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మాటలకు, చేసే పనులకు ఎక్కడా పొంతన ఉండదని... తాను మాత్రం చెప్పిందే చేస్తానని అన్నారు. రైతుల విషయంలో గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు.