నామినేషన్ దాఖలు చేసిన స్టాలిన్ విజయ్

ఎన్నికల సమరం ప్రారంభం

జనం న్యూస్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం ఎంకే స్టాలిన్, నటుడు విజయ్ నామినేషన్ దాఖలు చేశారు. తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రచారం, నామినేషన్లు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నామినేషన్ వేశారు. టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. 2011, 2016 , 2021లో వరుసగా తాను గెలుపొందిన కొలత్తూరు నియోజకవర్గం నుంచి ఎంకే స్టాలిన్ తాజాగా మరోసారి నామినేషన్‌ను దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత, స్టాలిన్ కొంత సమయం రోడ్ షో నిర్వహించి, ప్రజలకు అభివాదం చేసారు. ఇటీవల డీఎంకే అధినేత స్టాలిన్ కోలత్తూరు నియోజకవర్గంలో తాను సాధించిన విజయాలపై ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు గాను డీఎంకే 164 స్థానాల్లో పోటీ చేయనుండగా, దాని మిత్రపక్షాలకు 70 సీట్లను కేటాయించింది. ఈ భాగస్వాములలో కాంగ్రెస్ పార్టీకి 28 సీట్లు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI)కి 5 , కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (CPI(M))కి 5 , వీసీకేకి పార్టీకి 8 సీట్లు, MDMK కు 4 సీట్లు కేటాయించారు. దీనితో పాటు కూటమిలో దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK) పార్టీకి 10 సీట్లు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML)కు 2 సీట్లు కేటాయించారు. ఇన్‌కమ్ టాక్స్ చెల్లించని గృహిణులందరికీ సమీపంలోని దుకాణాల నుండి తమకు నచ్చిన ఏదైనా ఎలక్ట్రానిక్ హోమ్ అప్లియన్స్ కొనుగోలు చేసేందుకు రూ.8,000 కూపన్‌ను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మహిళలకు ఇస్తున్న సాయాన్ని రూ.2 వేలకు పెంచనున్నట్లు తెలిపారు. దీనితో పాటు రైతులకు ఉచితంగా మీటర్ లేని అధునాతన పంపు సెట్లు, యువతకు ఉచిత ల్యాప్‌టాప్స్, రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా పంపెు, ఐదేళ్లలో 10 లక్షల ఇళ్ల నిర్మాణం వంటి హామీలను మేనిఫెస్టోలో పేర్కొన్నారు. విజయ్ నామినేషన్ తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీకి చెందిన విజయ్, తొలిసారిగా ఎన్నికల బరిలోకి నిలుస్తున్నారు. చెన్నైలోని పెరంబూర్ , తిరుచి ఈస్ట్ అనే రెండు అర్బన్ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 234 మంది అభ్యర్థుల జాబితాను తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ విడుదల చేశారు. తాను పెరుంబూరు, తిరుచిరాలపల్లి ఈస్ట్ నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేస్తున్నారు. విజయ్ వ్యాసర్‌పడిలోని డాక్టర్ అంబేద్కర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో రిటర్నింగ్ అధికారి ఎదుట నామినేషన్‌ను దాఖలు చేశారు. విజయ్‌ నామినేషన్ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్, సంయుక్త ప్రధాన కార్యదర్శి సిటిఆర్ నిర్మల్ కుమార్ సహా పలువురు సీనియర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. టీవీకే పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ.4 వేలు భృతి ఇస్తామని, యువతకు విద్య కోసం రూ.20 లక్షల సహయం చేయనున్నట్లు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. దీనితో పాటు 75 శాతం ఉద్యోగాలు తమిళులకే ఇవ్వాలనే నిర్ణయాన్ని అమలు చేస్తామని తెలిపారు. తమిళనాడు ఎన్నికలు ఏప్రిల్ 23న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 234 శాసన సభ స్థానాలకు ఎలక్షన్స్ జరగుతాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే పార్టీ 164 స్థానాల్లో, మిత్రపక్ష పార్టీలు 70 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.