
సాక్షి డిజిటల్ న్యూస్ : పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని పెదపేటలో త్వరలోనే రామాలయాన్ని పునర్నిర్మిస్తామని ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని పెదపేటలో త్వరలోనే రామాలయాన్ని పునర్నిర్మిస్తామని ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు తెలిపారు. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా ఆకివీడు పెదపేటలో ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నం జరిగింది. దీంతో ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. ఆ తర్వాత పెదపేటలో పురాతన రామాలయ పునర్నిర్మాణం చేపట్టాలని పలు హిందూ సంఘాలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రఘురామకృష్ణరాజు పెదపేటలోని పురాతన రామాలయ పునర్నిర్మాణాన్ని ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ దేవాలయం డిజైన్ చిత్రాన్ని పోస్టు చేశారు. పెదపేటలోని పురాతన రామాలయ పునర్నిర్మాణాన్ని ప్రముఖ హిందూ సంస్థల ఆధ్వర్యంలో, ప్రముఖ స్థపతి డా. ఈమని శివనాగిరెడ్డి గారి నేతృత్వంలో శిల్పకళ, వాస్తు, ఆగమ శాస్త్రం ప్రకారం చేపడతామని చెప్పారు. పూర్తిగా కృష్ణ శిలతో అద్భుతంగా కనీసం 8 శతాబ్దాల పాటు చెక్కు చెదరని విధంగా త్వరలో నిర్మాణం ప్రారంభించనున్నట్టుగా తెలిపారు. అసలు వివాదం ఏమిటి?, శ్రీరామనవమి రోజున ఏం జరిగింది?గత కొద్ది రోజులుగా పెదపేటలోని పురాతన ఆలయంకు సంబంధించి వివాదం కొనసాగుతుంది. చాలా ఏళ్ల కిందట పెదపేట ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. హిందువులు ఈ ఆలయంలో నిరంతరాయంగా పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. గతంలో శ్రీరామనవమి వేళ వేడుకలు నిర్వహించినట్టుగా చెబుతున్నారు. అయితే అక్కడ పునర్నిర్మాణం చేపట్టాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నిర్ణయించారు. అయితే ఆ ప్రాంతంలో నివసించే కొందరు స్థానికులు అక్కడ రామాలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆలయంలో ప్రధాన దైవం వాస్తవానికి గొంతెనమ్మ అని వారు చెబుతున్నారు. అయితే రఘురామకృష్ణరాజు అక్కడ రామాలయం పునర్నిర్మాణం చేపట్టాలనే నిర్ణయంతో ఉన్నారు. తాజాగా రఘురామకృష్ణరాజు శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం ఉదయం పెదపేటకు చేరుకున్నారు. అక్కడ స్థానికులు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకుని నిరసన తెలిపారు. ఆలయంలో గొంతెనమ్మ, నందీశ్వరుణ్ని మాత్రమే పూజించాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు భద్రత మధ్య రఘురామకృష్ణ రాజు సీతారాముల విగ్రహాలకు పూలమాలలు వేసి, తిరిగి వెళ్తుండగా పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. కొందరు రఘురామకృష్ణరాజు కాన్వాయ్‌పై దాడికి యత్నించారు. రఘురామకృష్ణరాజు కాన్వాయ్ వెళ్లిన తర్వాత అక్కడ ఘర్షణ మరింతగా పెరిగింది. కూటమి నాయకులు, రామభక్తులపై కొందరు యువకులు మేకులు గుచ్చిన కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. దీంతో పలువురు గాయపడ్డారు. అయితే ఈ ఘటన వెనక భారీ కుట్ర ఉందని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ దాడిలో స్థానికేతరుల ప్రమేయం ఉందని అన్నారు. దళిత ముసుగులో ఉన్న క్రైస్తవులు తాను రాముల వారిని దర్శనం చేసుకుంటున్న సమయంలో పెద్దగా కేకలు వేశారని, తాను అక్కడి నుంచి బయలుదేరిన వెంటనే ఆలయం వద్ద ఉన్న రామ భక్తులపై కత్తులతో దాడి చేసి చాలా మందిపై హత్యా ప్రయత్నం చేశారని ఆరోపణలు చేశారు. ఇటీవల గౌరవ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.