సెలవు కోసం అడిగితే ఇదేనా స్పందన?

కంపెనీ దహనం చేసిన ఉద్యోగి అరెస్ట్

జనం న్యూస్: అమరావతిలో మెగా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరగలేదని పోలీసులు తేల్చారు. సెలవు ఇవ్వలేకపోవడంతో సూపర్ వైజర్‌పై కోపం మరో సెక్యూరిటీ గార్డుతో గొడవ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా సెక్యూరిటీ గార్డు రాము కంపెనీకి నిప్పుపెట్టాడు. బంధువులు చనిపోయారు సెలవు కావాలని అడిగితే సూపర్ వైజర్ నో లీవ్ అన్నాడు. అదే సమయంలో తోటి సెక్యూరిటీ గార్డుతో గొడవ జరిగింది. ఇద్దరిపై అక్కసు పెంచుకున్న సెక్యూరిటీ గార్డు కోపంతో రగిలిపోయాడు. వారిపై కోపంతో ఏకంగా కూడుపెడుతున్న కంపెనీకి నిప్పంటించాడు. ఆ ప్రమాదాన్ని వారిద్దరిపైకి నెట్టేయాలని చూశాడు. కానీ అతడి పాచిక పారలేదు. పోలీసుల విచారణలో అడ్డంగా దొరికిపోయాడు. సూపర్ వైజర్, సెక్యూరిటీ గార్డుపై కోపంతో ఉద్దేశపూర్వకంగానే తాను కంపెనీకి నిప్పు పెట్టినట్లు అంగీకరించాడు. ఇలా అర్థంపర్థంలేని ఆవేశంతో తోటిఉద్యోగులకు ఇబ్బంది పెడదామని భావించి చివరికి కటకటాలపాలయ్యాడు. అతడి ఆవేశం కూర్చున్న కొమ్మను నర్కున్నట్లే కాకుండా కంపెనీకి ఏకంగా రూ.9 కోట్లు తెచ్చిపెట్టింది. ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్న సిట్ బృందం నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. మెగా ఇంజనీరింగ్‌ కంపెనీలో ప్రమాదం సెక్యూరిటీ గార్డు పనే. అమరావతిలో మెగా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన కేసును పోలీసులు ఛేదించారు. ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదని కుట్రపూరితంగా జరిగింది అని తేల్చారు. ఈ ఘటనకు కారణమైన నిందితుడు సెక్యూరిటీ గార్డ్ రామును పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్యూరిటీ గార్డు రామును గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.సూపర్ వైజర్ హన్మంతరావు తనకు సెలవు ఇవ్వలేదనే అక్కసుతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. అమరావతిలో మార్చ్ 23న మెగా ఇంజనీరింగ్ కంపెనీ స్టాక్ పాయింట్‌లో అగ్నిప్రమాదం జరిగింది.‘ఆరోజు సాయంత్రం ఫైర్ యాక్సిడెంట్ అయింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అదేరోజు రాత్రి ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్ వచ్చాయి, క్లూస్ టీమ్ చేరుకొని ఆధారాలు సేకరించారు. మెగా వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేశాము. మొత్తం రూ.9 కోట్లు నష్టం జరిగినట్లు అంచనా’అని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు.‘రాజధానిలో ఇలా ఫైర్ యాక్సిడెంట్ జరగడం ఇది మూడోది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అడిషనల్ ఎస్పీ రవి కుమార్ ఆధ్వర్యంలో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మా విచారణలో అక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డ్ తిప్పగుడిసి రాము పై అనుమానం రావడంతో అతన్ని విచారించాం’అని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. కంపెనీ డీజిల్‌తోనే నిప్పు పెట్టాడు. సెక్యూరిటీ గార్డ్ తిప్పగుడిసి రాము తమ విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో లోతైన విచారణ చేస్తే అతనే నిప్పు పెట్టినట్లు ఒప్పుకున్నాడు అని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. ఘటన జరిగిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ ఫోన్‌లో ఒక కీలక సమాచారం దొరికింది. ఆరోజు స్టాక్ అంతా బాగానే ఉందని రాము మెగా వాట్సాప్ గ్రూప్‌లో 10:20కి ఒక ఫోటో పెట్టాడు. ఆ తర్వాత 10:35కు కూడా ఒక ఫోటో వాట్సాప్ గ్రూప్‌లో పెట్టాడు. అప్పటికే ఆ ఫోటోలో ఓ ఆరెంజ్ కలర్ లైట్ కనబడింది. ఆ కోణంలో రాము ని ప్రశ్నించాం’అని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు.‘రాము నేరం ఒప్పుకోవడంతో అతన్ని అరెస్ట్ చేసి 326(G) bns కింద కేసు కట్టి రిమాండ్‌కు తరలించాం. రాము ఆరోజు ఉదయమే జనరేటర్‌లో డీజిల్ ఫిల్ చేసే సమయంలో ఒక బాటిల్‌లో ఒక లీటర్ డీజిల్ తీసి పెట్టాడు. దాంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు’ అని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. అక్కసుతోనే నిప్పు పెట్టిన సెక్యూరిటీ గార్డు ఇకపోతే అగ్ని ప్రమాదం జరిగిన రోజు ఉదయం సూపర్ వైజర్ హనుమంతరావుతో సెక్యూరిటీ గార్డ్ రాముతో వాగ్వాదం జరిగింది అని పోలీసుల విచారణలో తేలింది. బంధువులు చనిపోతే సెలవు ఇవ్వలేదని రాము కోపం పెంచుకున్నాడు అని తేలింది. అదే రోజు సాయంత్రం 5:30 కి మరో సెక్యూరిటీ గార్డ్‌తో రాముకు వాగ్వాదం జరిగింది. అదే అక్కసుతో అతనే ఉద్దేశ్యపూర్వకంగా ఆరోజు రాత్రి 9:30 తర్వాత నిప్పు అంటించాడు. 10:15కి రౌండ్ కి వెళ్లి వచ్చాడు.. అప్పటికే ఫైర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 10:35 తర్వాత ఫైర్ అయింది అని వాట్సాప్ గ్రూప్ ఫోటో పెట్టి...అధికారులకు సమాచారం ఇచ్చాడు’అని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ‘ఇంకా ఈ కేసులో విచారణ కొనసాగుతోంది... కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నాం. వరుస ఘటనల నేపథ్యంలో అమరావతి లో 6 చెక్ పోస్టులు పెట్టాము.. నిత్యం పోలీసులు గస్తీ ఉంటుంది. ఎవరైనా రాజధానిలో ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం’అని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు.