మూసీ శుద్ధి పనులకు ఆటంకాలు సహించబోమని సీఎం హెచ్చరిక

జనం న్యూస్: మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళన ఈశ్వరుడి ఆశీర్వాదంతోనే ప్రభుత్వం చేపట్టిందని రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళన ఈశ్వరుడి ఆశీర్వాదంతోనే ప్రభుత్వం చేపట్టిందని రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ నది ప్రక్షాళనకు అన్ని అడ్డంకులను ఈశ్వరుడే తొలగిస్తారని అన్నారు. ఎవరైనా దీనిపై దుష్ప్రచారం చేసినా, దీనికి పెడర్థాలు అంటగట్టినా ప్రభుత్వం శివతాండవం చేస్తుందని హెచ్చరించారు. ఎవరెన్ని విమర్శలు, అడ్డంకులు సృష్టించినా మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. మానవ తప్పిదాల వల్ల గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ కనుమరుగయ్యే ప్రమాదం నుంచి కాపాడి భవిష్యత్తరాలకు అత్యద్భుతమైన నగరాన్ని అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా మూసీ తీరం గండిపేట - మంచిరేవులలోని చారిత్రక వీరభద్రస్వామి ప్రాంగణంలో శ్రీ మచిలేశ్వర స్వామి, శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గోవు పూజ నిర్వహించి గోశాలను ప్రారంభించారు. శ్రీ మచిలేశ్వర స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయాన్ని 8 ఎకరాల్లో దాదాపు రూ. 700 కోట్లతో పునర్నిర్మాణం, అభివృద్ది పనులను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. మూసీ ప్రక్షాళన చేయడమన్నది ఇప్పుడు నిత్యావసర వస్తువులకన్నా అత్యవసరమని పేర్కొన్నారు. మూసీ పరీవాహక ప్రాంతాన్ని మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా, ప్రత్యేకమైన ధ్యానమందిరాలతో ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు. అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. ఇది తమ దీక్ష అని చెప్పారు. మూసీ నది ప్రక్షాళనతో పాటు దక్షిణ కాశీగా రాణించే విధంగా ఈ పుణ్యక్షేత్రాన్ని పునర్నిర్మిస్తామని తెలిపారు. రామప్ప ఆలయ నమూనాను ఇక్కడ నిర్మించాలని సంకల్పించామని ఇది యథాలాపంగా చేస్తున్నది కాదని దైవేచ్ఛతో సాగుతున్న కార్యక్రమంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ పని చేపట్టిన ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలని, సహకరించాలని కోరారు.