మూసీ ప్రక్షాళనపై కఠిన హెచ్చరిక

అడ్డుపడితే శివతాండవం చేస్తాం – సీఎం రేవంత్

అక్షర ఆయుధం : మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళన ఈశ్వరుడి ఆశీర్వాదంతోనే ప్రభుత్వం చేపట్టిందని రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళన ఈశ్వరుడి ఆశీర్వాదంతోనే ప్రభుత్వం చేపట్టిందని రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ నది ప్రక్షాళనకు అన్ని అడ్డంకులను ఈశ్వరుడే తొలగిస్తారని అన్నారు. ఎవరైనా దీనిపై దుష్ప్రచారం చేసినా, దీనికి పెడర్థాలు అంటగట్టినా ప్రభుత్వం శివతాండవం చేస్తుందని హెచ్చరించారు. ఎవరెన్ని విమర్శలు, అడ్డంకులు సృష్టించినా మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. మానవ తప్పిదాల వల్ల గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ కనుమరుగయ్యే ప్రమాదం నుంచి కాపాడి భవిష్యత్తరాలకు అత్యద్భుతమైన నగరాన్ని అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా మూసీ తీరం గండిపేట - మంచిరేవుల లోని చారిత్రక వీరభద్రస్వామి ప్రాంగణంలో శ్రీ మచిలేశ్వర స్వామి, శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గోవు పూజ నిర్వహించి గోశాలను ప్రారంభించారు. శ్రీ మచిలేశ్వర స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయాన్ని 8 ఎకరాల్లో దాదాపు రూ. 700 కోట్లతో పునర్నిర్మాణం, అభివృద్ది పనులను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన చేయడమన్నది ఇప్పుడు నిత్యావసర వస్తువులకన్నా అత్యవసరమని పేర్కొన్నారు. మూసీ పరీవాహక ప్రాంతాన్ని మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా, ప్రత్యేకమైన ధ్యానమందిరాలతో ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు.అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. ఇది తమ దీక్ష అని చెప్పారు. మూసీ నది ప్రక్షాళనతో పాటు దక్షిణ కాశీగా రాణించే విధంగా ఈ పుణ్యక్షేత్రాన్ని పునర్నిర్మిస్తామని తెలిపారు. రామప్ప ఆలయ నమూనాను ఇక్కడ నిర్మించాలని సంకల్పించామని... ఇది యథాలాపంగా చేస్తున్నది కాదని... దైవేచ్ఛతో సాగుతున్న కార్యక్రమంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ పని చేపట్టిన ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలని, సహకరించాలని కోరారు. చరిత్రను గమనిస్తే, నదీ పరీవాహన ప్రాంతాలు, సముద్ర తీరాల్లోని ప్రాంతాలు అభివృద్ధిని సాధించాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సముద్రతీరం లేని రాష్ట్రమని... అయితే రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, ఈసా నదులున్నా ఆ జలాలను సరిగా వినియోగించు కోకపోవడం వల్ల కొన్ని తరాలు నష్టపోయాయని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ నగరం కాలుష్యంతో జనజీవనం స్తంభించిపోతుందని... రాష్ట్రపతి, ప్రధానమంత్రులు ఉండే ఢిల్లీలో యమునా నది కాలుష్యమై పారుతోందని అన్నారు. కాలుష్యం కారణంగా సెలవులు ప్రకటించడం, పెట్టుబడులు తరలిపోవడం వంటి పరిస్థితుల నుంచి మనం నేర్చుకోవలసిన అవసరం ఉందా లేదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరం మత సామరస్యానికి ఒక వేదిక అని... మూసీ ప్రక్షాళనలో భాగంగా అత్యధిక ప్రాధాన్యత కలిగిన చార్మినార్ మక్కా మసీదు ప్రాంతంలో అద్భుతమైన మసీదును నిర్మించనున్నామని తెలిపారు. గౌలిగూడ ప్రాంతంలో సిక్కు చరిత్ర ఉందని... ఆ ప్రాంతంలో స్వర్ణ దేవాలయంలాంటి దేవాలయం నిర్మాణం, ఉప్పల్ నాగోల్ ప్రాంతంలో అద్భుతమైన చర్చి నిర్మించబోతున్నామని చెప్పారు. మూసీలో నిరంతర నీటి ప్రవాహం ఉండేలా, నగర ప్రజల తాగునీరు, పరిశ్రమల అవసరాలను తీర్చడానికి గోదావరి నుంచి 20 టీఎంసీలను తరలించనున్నామని తెలిపారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజాప్రతినిధులందరూ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని కోరుతున్నారని చెప్పారు. ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ మంత్రివర్గ సహచరుల సహకారంతో ముందుకు వెళుతున్నామని అన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేశారని... ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని, వారు కేసును ఉపసంహరించుకోవాలని కోరారు.