
సాక్షి డిజిటల్ న్యూస్ : పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా- ఇజ్రాయెల్ మధ్య జరుగుతోన్న యుద్ధం ప్రభావం భారత్‌పై కూడా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షోభాన్ని ఎదుర్కొడానికి టీమిండియా స్ఫూర్తితో సాగుదామని వారికి పీఎం సూచించినట్టు తెలుస్తోంది. యుద్ధం కారణంగా దేశంలో చమురు, వంట గ్యాస్ కొరత లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని పెంచినట్టు కేంద్రం తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధంతో నెలకున్న ఉద్రిక్తతలు, దేశంపై దాని ప్రభావం, పరిణామాలపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. సాయంత్రం 6.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని వారితో మాట్లాడారు. ఈ సమావేశానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు, కేరళ సహా ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం దూరంగా ఉన్నారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి సహా మిగతా రాష్ట్రాల సీఎంలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాల సన్నద్దత, ప్రణాళికలపై ప్రధాని చర్చలు జరిపారు. టీమిండియా స్ఫూర్తితో రాష్ట్రాలను సమన్వయం చేసుకునేలా జరిగిన ఈ భేటీకి హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. పార్లమెంట్‌లో పశ్చిమాసియా యుద్ధ పరిణామాలు, చమురు, గ్యాస్ సంక్షోభం నివారణకు భారత్ తీసుకుంటున్న చర్యల గురించి ప్రధాని మోదీ ప్రసంగించిన సంగతి తెలిసిందే. పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతల దృష్ట్యా, ఇంధన సరఫరా, ద్రవ్యోల్బణం, లాజిస్టిక్స్ అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ పరిస్థితి వల్ల తలెత్తే ఏవైనా పరిణామాలను ఎదుర్కోవడానికి సంసిద్ధతను కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. సంక్షోభం దృష్ట్యా విద్రోహ శక్తులు విఘాతం కలిగించే అవకాశం ఉందని, తీర ప్రాంతాలు, సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఈసందర్భంగా ప్రదాని ఆదేశించారు. అలాగే, తప్పుడు సమాచారం వ్యాప్తిచేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిరత కారణంగా భారత్‌కు ఇంధన సంక్షోభం ముప్పు పొంచి ఉంది. క్రూడాయిల్, గ్యాస్ సరఫరాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అంతర్జాతీయంగా సరఫరా గొలుసు దెబ్బతినడంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని, పరిణామాలను ఎదుర్కొండానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రులకు మోదీ సూచించినట్టు తెలుస్తోంది. అయితే, సంక్షోభాన్ని ఎదుర్కొడానికి తీసుకోబోయే చర్యల గురించి ముఖ్యమంత్రులు సైతం ప్రధానికి తమ అభిప్రాయాలను తెలియజేసినట్టు సమాచారం.