పెట్రోల్, గ్యాస్ సరఫరాపై అపోహలు వద్దని మంత్రి ఉత్తమ్ సూచన

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులతోపాటు గ్యాస్ సరఫరాపై పెరిగిన ఒత్తిడి నియంత్రించినట్లు తెలిపారు. గ్యాస్, పెట్రోల్ సరఫరాపై అపోహలు వద్దు అని చెప్పుకొచ్చారు.పీఎన్‌జీనెట్ విస్తరణలో కేంద్రంతో సమన్వయం చేసుకుంటాం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తులతో పాటు ఎల్.పి.జి గ్యాస్ సరఫరాలో పెరిగిన వత్తిడిని ప్రభుత్వం సమర్థవంతంగా నియత్రించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వినియోగదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. శనివారం దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులతో పాటు వంటగ్యాస్ సరఫరాపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు,గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖా మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్,హార్డిప్ సింగ్ పూరి,ప్రహ్లాద్ జోషీలు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్రం నుండి రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇదే వీడియో కాన్ఫరెన్స్‌లో దేశవ్యాప్తంగా 14 మున్సిపల్ కార్పోరేషన్‌లకు చెందిన ప్రతినిధులతో పాటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర,జీ. హెచ్ యం సి ప్రతినిధులు పాల్గొన్నారు. అపోహలు పెరగడంతోనే ప్రజల్లో గందరగోళం ఇరాన్- అమెరికాల మధ్య కొనసాగుతున్న యుద్ద వాతావరణ ప్రభావంతో పెట్రోలియం ఉత్పత్తులతో గృహ వినియోగదారులకు వంటగ్యాస్ సరఫరాపై ప్రజల్లో అపోహలు పెరిగి నందునే ప్రజల్లో అయోమయం నెలకొనిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళనలు పెరగడంతో తాత్కాలికంగా కొంత మేర ఇబ్బంది ఏర్పడిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రంగంలోకీ దిగి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో సమర్థవంతంగా వత్తిడిని నియంత్రించ గలిగామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని, డిమాండ్ కు తగిన రీతిలో సరఫరా కొనసాగుతోందని పైగా తాను స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు పంపిణీ దారులతో సమీక్షలు నిర్వహిస్తున్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృత్రిమ కొరతను సృష్టించే వారిపై చర్యలు వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్.పి.జి కొరతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణాకు వాణిజ్య అవసరాలకు పంపిణీ చేసే కేటాయింపులను పెంచాలని ఆయన కేంద్ర మంత్రులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. కేంద్రం వాణిజ్య అవసరాలకు పంపిణీ చేసే గ్యాస్ కోటా కేటాయింపులను పెంచగలిగితే వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ సరఫరా చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని రాష్ట్రమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందన్నారు. బ్లాక్ మార్కెట్ కు తరలించడంతో పాటు అక్రమాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెంచి కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో పైపుల ద్వారా వంటగ్యాస్ సరఫరా నెట్ వర్క్ విస్తరణలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ముందుకు పోతామన్నారు. హైదరాబాద్ లో భాగ్యనగర్ గ్యాస్ సంస్థ ద్వారా సి.ఎన్.జి సరఫరాను విస్తరిస్తున్నామని, జంట నగరాలలో ఆటోలు, ట్యాక్సీ లతో పాటు ప్రయివేటు వాహనాలకు సి.ఎన్.జీ సరఫరాకై ఫిల్లింగ్ కేంద్రాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.