మార్కాపురం బస్సు ప్రమాదం డ్రైవర్, యజమాని అరెస్ట్

మృతుల సంఖ్య 14కు చేరింది

అక్షర ఆయుధం : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రకాశం జిల్లా మార్కాపురం బస్సు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు డ్రైవర్ యువరాజుతోపాటు యజమాని హరికృష్ణలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇద్దరినీ పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా 27 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. హరికృష్ణ ట్రావెల్స్ బస్సు టిప్పర్‌ను ఢీ కొట్టడంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 14 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా నిర్ధారించారు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ యువరాజును అరెస్ట్ చేశారు. అతడిని ప్రధాన నిందితుడిగా చేరుస్తూ సెక్షన్ 304 ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు హరికృష్ణ ట్రావెల్స్ యజమాని హరికృష్ణను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల విచారణ అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. 14 మంది మృతి ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఎవరిని కదిలించినా కన్నీటి కథనాలే. రెక్కాడితే గాని డొక్కాడని వారంతా మరికొద్ది సమయంలో ఇంటికి చేరకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో 13 మంది విగతజీవులుకాగా మరొక బాలుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు.ఇకపోతే ఈ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రులో చికిత్సపొందుతున్న వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. మెుత్తం 28 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది.మృతులంతా రెక్కాడితే గానీ డొక్కాడని వాళ్లే మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అంతా రెక్కాడితే కానీ డొక్కాడని వారిగా తెలుస్తోంది. మార్కాపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన సుతారీలు, కార్మికులు తెలంగాణ ప్రాంతంలోని జగిత్యాల, కోరుట్లలో రోజూవారీగా పనిచేస్తుంటారు. ఏపీ నుంచి వీరిని హరికృష్ణ ట్రావెల్స్ బస్సు జగిత్యాల, కోరుట్ల తీసుకెళ్తుంది.మళ్లీ పని అయిపోయిన తర్వాత తిరిగి తీసుకువస్తుంది. బతుకుదెరువు కోసం వీరంతా పొరుగు రాష్ట్రాల్లో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే క్రమంలో తెలంగాణ ప్రాంతంలో పనులు ముగించుకోగా జగిత్యాల నుంచి హరికృష్ణ ట్రావెల్స్‌లో వీరంతా బయలు దేరారు. ఇలా వస్తుండగా రాయవరం సమీపంలో క్వారీల వద్ద టిప్పర్‌ను ఢీ కొట్టింది.ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం కాగా 13 మంది సజీవ దహనమవ్వగా ఒక బాలుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 14కి చేరుకుంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ఉండగా, మంటలు చెలరేగగానే 10 మంది కిందకు దిగిపోయారు. 15 మంది గాయపడగా వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక చనిపోయిన వారిలో కనిగిరి, పామూరు వాసులుగా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బస్సు కండీషన్‌ సరిగా లేదని చెప్పిన ప్రయాణికులు ఇదిలా ఉంటే జగిత్యాల నుంచి హరికృష్ణ ట్రావెల్స్ బస్సు బయలుదేరేటప్పుడు కండీషన్ సరిగా లేదని డ్రైవర్‌తో ప్రయాణికులు చెప్పినట్లు తెలుస్తోంది.ప్రయాణికులు డ్రైవర్‌కు ముందుగానే చెప్పడంతో యర్రగొండపాలెం వద్ద గంటసేపు బస్సు నిలిపివేసి మరమ్మతులు చేశారు. ఆ తర్వాత బస్సు తిరిగి బయలుదేరింది. డ్రైవర్‌తోపాటు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉండి ఉంటే ఇంతమంది బలి అయ్యేవారు కాదు అని స్థానికులు అంటున్నారు.