
పయనించే సూర్యుడు న్యూస్ : పశ్చిమాసియాలో యుద్దం నేపథ్యంలో భారత్‌లో ఇంధన ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా చోట్ల పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పెట్రోల్ బంక్‌ల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్దం నేపథ్యంలో భారత్‌లో ఇంధన ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా చోట్ల పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పెట్రోల్ బంక్‌ల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. అయితే ఈ క్రమంలోనే అధికారులు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో ఇంధన కొరత ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. అనవసరంగా ఫుల్ ట్యాంకులు చేయించవద్దని వాహనదారులను కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలో ఇంధన సరఫరాపై తలెత్తిన అపోహల నేపథ్యంలో బుధవారం రోజున టీజీసీసీసీలో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్... జిల్లా కలెక్టర్ హరిచందన, అదనపు సీపీ తప్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ శ్వేతలతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం సీపీ సజ్జనార్ మాట్లాడుతూ... నగరంలో ఇంధన కొరత ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అందువల్ల ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, నగరవ్యాప్తంగా సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు వచ్చి వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల అకస్మాత్తుగా డిమాండ్ పెరిగి, కొన్ని చోట్ల తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని చెప్పారు. అయితే ఈ పరిస్థితిని ఇంధన కొరతగా భావించవద్దని కోరారు. తప్పుడు ప్రచారాల వల్ల పెట్రోల్, డీజిల్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగిందని చెప్పారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 22న 3,024 కిలోలీటర్ల ఇంధనం అమ్ముడవగా, 23న ఆ సంఖ్య రెట్టింపై 6,400 కిలోలీటర్లకు చేరుకుందని చెప్పారు. జనం భయాందోళన చెందడం వల్లే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయని తెలిపారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లు, డబ్బాల్లో లూజ్ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేసే వారిపై నిఘా ఉంచామని చెప్పారు. అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 240 పెట్రోల్ బంకుల్లో పరిస్థితిని సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. ఆయిల్ సంస్థలు, సివిల్ సప్లై అధికారులతో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని చెప్పారు. ప్రజల సౌకర్యార్థం ప్రత్యేకంగా కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలోని 186 బంకుల్లో ఇంధన సరఫరా సజావుగా సాగుతోందని, ప్రజలు అనవసర ఆందోళనతో బంకుల వద్ద రద్దీ పెంచవద్దని కోరారు. నిత్యావసర సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, క్షేత్రస్థాయిలో యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలను గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.