
జనం న్యూస్: ‘సమాజంలో వైద్య రంగం ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రజలకు ఉపయోగపడే సూచనలను స్వీకరిస్తాం. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత విద్య, వైద్యం. విద్య పరంగా నర్సరీ నుంచి 10 వరకు, వైద్యం పరంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి స్పెషాలిటీ హాస్పిటల్స్ వరకు ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం. మంచి రోల్ మాడల్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నాం’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్రంగా వివరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూనే, నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి, అవసరమైతే మరిన్ని నిధులను సమకూర్చుతామని స్పష్టం చేశారు.ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పేదల వైద్యానికి ఎక్కడా నిధుల కొరత లేకుండా ఇప్పటివరకు అత్యధికంగా నిధులు వెచ్చించినట్టు వివరించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం గడిచిన 27 నెలల కాలంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎల్ఓసీ రూపంలో అందించిన ఆర్థిక సహాయానికి సంబంధించిన గణాంకాలను శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు.శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని అనేక అంశాలను తెలిపారు. 1.15 కోటి కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ‘రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలోని 1.15 కోటి కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయబోతున్నాం. పేదలకు జీవిత బీమాను అందించి వారిలో ధీమా కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతోంది’అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 4,500 కోట్లు పేదల వైద్యం కోసం ఖర్చు చేశాం. గడిచిన 27 నెలల కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 2046 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ. 2,400 కోట్లు మొత్తంగా రూ. 4,500 కోట్లు పేదల వైద్యం కోసం ఖర్చు చేశాం’అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వ బకాయిలు చెల్లించాం. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 6వ డిసెంబర్ 2023 వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ప్రతి నెలా సగటున రూ.52 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ తర్వాత 7 డిసెంబర్ 2023 నుంచి 25 మార్చి 2026 కాలంలో ప్రజా ప్రభుత్వం సగటున ప్రతి నెలా రూ. 89 కోట్లు ఖర్చు పెట్టింది’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వం బకాయిల భారాన్ని మాపై పెట్టింది. ఆ భారాన్ని మోస్తూనే.. రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచాం. 7 డిసెంబర్, 2023 నాటికి గత ప్రభుత్వం నుండి రాజీవ్ ఆరోగ్యశ్రీలో వారసత్వంగా వచ్చిన భారం రూ. 600.27 కోట్లు. అందులో ప్రభుత్వ ఆసుపత్రులకు రూ. 240.11 కోట్లు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 360.16 కోట్ల బకాయి ఉంది’అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.