
సాక్షి డిజిటల్ న్యూస్ : ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్‌ల యుద్దం నేపథ్యంలో చాలా దేశాల్లో ఇంధన ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ యుద్దం ప్రభావం భారత్‌పై కూడా ఉంటుందని... ఇంధన కొరత తలెత్తుందనే ప్రచారం సాగుతుంది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్‌ల యుద్దం నేపథ్యంలో చాలా దేశాల్లో ఇంధన ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ యుద్దం ప్రభావం భారత్‌పై కూడా ఉంటుందని... ఇంధన కొరత తలెత్తుందనే ప్రచారం సాగుతుంది. ఇప్పటికే ఎల్పీజీ సిలిండర్ల కోసం జనాలు ఏజెన్సీల ఎదుట బారులు తీరి కనిపిస్తున్నారు. అయితే గత రెండు, మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది. ఈ క్రమంలోనే చాలా చోట్ల వాహనదారులు పెట్రోల్ బంక్‌ల ఎదుట బారులు తీరి కనిపిస్తున్నారు. అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ వాహనాల్లో నింపుకుంటున్నారు. అంతేకాకుండా క్యాన్లు, బాటిల్స్‌లో కూడా తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే పలుచోట్ల పెట్రోల్ బంక్‌ల ఎదుట నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే ఈ భయాందోళనతో హైదరాబాద్‌లో కూడా పలు చోట్ల పెట్రోల్ బంక్‌ల ఎదుట జనాలు బారులు తీరిన పరిస్థితి నెలకొంది. దీంతో కొన్ని చోట్ల పెట్రోల్ బంక్‌ల ముందు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అలాగే, ఎల్పీజీ సిలిండర్ల కోసం కూడా జనాలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ పరిస్థితులపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ స్పందించారు. హైదరాబాద్‌లో ఇంధనం, ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదని సజ్జనార్ తెలిపారు. తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ నగరం అంతటా సరఫరా సజావుగా సాగుతోందని వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని... పెట్రోల్ బంక్‌లు, గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం ద్వారా పెట్రోల్ బంక్‌లు, గ్యాస్ ఏజెన్సీల వద్ద అనవసరమైన రద్దీ, అంతరాయాలు ఏర్పడవచ్చని అన్నారు. హైదరాబాద్ నగర పోలీసులు సంబంధిత అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని సజ్జనార్ వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని కోరారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని... వదంతులను వ్యాప్తి చేయవద్దని చెప్పారు. సాధారణ పరిస్థితులు కొనసాగేలా అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలాఉంటే, రాష్ట్రంలో గ్యాస్ కొరత ఉందని బీఆర్ఎస్ నిరసన చేపట్టింది.గ్యాస్ కొరతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాయని ఆరోపిస్తూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దొంగ నాటకాలు ఆపాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ... ఎల్పీజీ కొరతపై ప్రజలు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం కొరత లేదని చెబుతుందని... రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పేరు చెప్పి తప్పించుకుంటుందని ఆరోపించారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత సిలిండర్ సైజును తగ్గిస్తున్నట్లు మాకు సమాచారం ఉందని అన్నారు.