
పయనించే సూర్యుడు న్యూస్ : పశ్చిమాసియాలో గత నెల 28న మొదలైన యుద్ధం.. యావత్తు ప్రపంచాన్ని అల్లకల్లోలంగా మార్చేస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా రగలిపోతుంది. ఈ యుద్ధం కారణంగా చమురు ధరలు పైపైకి వెళ్తున్నాయి. ఇక, మన దేశంలోని ఎన్నికలపై కూడా ఈ యుద్ధ ప్రభావం పడుతోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి కేరళకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోనుంది. పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు, కేరళ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెలలో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజులుగా ఇజ్రాయెల్- అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అయితే, ఈ సంఘర్షణ వచ్చె నెల భారత్లో జరగనున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల పైనా ప్రభావం చూపనుంది. ముఖ్యంగా కేరళ అసెంబ్లీ ఎన్నికలపై దీని ఎఫెక్ట్ భారీగా పడే అవకాశం ఉంది. ఇది మొత్తం ఫలితాన్నే ఇది ప్రభావితం చేయకపోయినా... కొన్నిచోట్ల గెలుపోటములను నిర్దేశించొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమతున్నాయి. మొత్తం 140 స్థానాలున్న కేరళలో ఏప్రిల్ 9న ఒకే దశలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లే భారతీయుల్లో కేరళ వాసులే అధికం. కేరళ మైగ్రేషన్ సర్వే గణాంకాల ప్రకారం.. పశ్చిమాసియాలో దాదాపు 22 లక్షలు మంది కేరళీయలు ఉన్నారు. వీరంతా ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ సహా గల్ఫ్ దేశాల నుంచి సొంత రాష్ట్రానికి వస్తుంటారు. కొన్ని ప్రవాసీ గ్రూపులు వీరి కోసం ఛార్టర్డ్ విమానాలు నడుపుతుంటాయి. ప్రస్తుతం కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈస్టర్, ఇతర పండగలు ఉండటంతో అక్కడ నుంచి వచ్చేవారి సంఖ్య భారీగా ఉంటుందని భావించారు. కానీ, యుద్ధం కారణంగా వారు స్వదేశానికి వచ్చేందుకు అనుకూలమైన పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటి వరకూ వేలల్లోనే కేరళకు చేరుకున్నట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈసారి గల్ఫ్ దేశాల నుంచి ఓటేయడానికి వచ్చేవారి సంఖ్య సగానికిపైగా తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. యూఏఈ కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు పుథుర్ రెహమాన్ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలప్పుడు మేము యూఏఈ నుంచి 8 చార్టర్డ్ విమానాలు ఏర్పాటుచేసేవాళ్లం. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు’’ అని అన్నారు. యుద్ధంతో విమాన ప్రయాణాలను తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వేలాదిగా విమానాలు రద్దుకావడం, దుబాయ్, అబుధాబి, దోహా వంటి చోట్ల తాత్కాలికంగా విమానాశ్రయాలను మూసివేశాయి. దీని ప్రభావం నార్త్ కేరళలోని మలప్పురం, కొజికోడ్, కాసర్గడ్, పాలక్కాడ్, త్రిశూర్ జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాల్లో ఉండనుంది. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమిలో కీలక పార్టీ అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్.. గల్ఫ్ దేశాల నుంచి ఓటర్లతో ఎక్కువ లబ్ధి పొందుతుంటుంది. దీనిపై ఐయూఎంఎల్ ప్రధాన కార్యదర్శి సయ్యిది మునావర్ అలీ సాహిబ్ థంగల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం చాలా మంది వచ్చే అవకాశం తక్కువగా ఉందని, అయినా వారిని రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపారు. పరిస్థితిలో మార్పు రాకుంటే పోలింగ్ శాతం తగ్గుతుందని అన్నారు. యూఏఈలోనే కేరళ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. యుద్ధం ఆగిపోయి సాధారణ పరిస్థితి నెలకున్నా విమాన ఛార్జీలు కూడా భారీగా పెరుగుతాయని కేఎంసీసీ యూఏఈ నేషనల్ కమిటీ జనరల్ సెక్రటెరీ అన్వర్ నాహా అన్నారు. ఇదిలా ఉండగా, మొత్తం పోలింగ్ శాతంపై ప్రవాసీ ఓటర్ల ప్రభావం స్వల్పంగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నార్త్ కేరళలోని నియోజకవర్గాల్లోనే ప్రవాసీ ఓటర్ల అధిక సంఖ్యంలో ఉన్నప్పటికీ ఇవన్నీ భారీ మెజార్టీతో గెలిచే స్థానాలేనని, దీని ప్రభావం పరిమితమేనని అంటున్నారు.