
అక్షర ఆయుధం : ప్రజల ఆశీస్సులే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శ్రీరామరక్ష అని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు కుప్పం ఓ ప్రయోగశాలగా అభివర్ణించారు. విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి అని సూచించారు. సమాజాభివృద్ధిలో మహిళలే కీలకం అని అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి అని నారా భువనేశ్వరి చెప్పుకొచ్చారు.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి, ప్రజలకు సంక్షేమం అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా ముందుగా కుప్పం నియోజకవర్గం నుంచే ముఖ్యమంత్రి మొదలుపెడతారని అన్నారు. సమాజాభివృద్ధిలో మహిళలదే కీలక పాత్ర అని, వారు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని అన్నారు. మహిళల ఆర్థిక ఉన్నతికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోందని, వాటిని అందిపుచ్చుకుని వారంతా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు మంకలదొడ్డి, సింగారపురం, మోట్లచెను, కూసురు గ్రామాల్లో పర్యటించిన నారా భువనేశ్వరి మహిళలతో సమావేశమయ్యారు. కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటాం ముందుగా కుప్పం నియోజకవర్గం మంకలదొడ్డి గ్రామంలో పర్యటించిన నారా భువనేశ్వరికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని కాళికా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ...కుప్పం నియోజకవర్గ ప్రజలకు మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ఇక్కడి ప్రజలు మమ్మల్ని ఎంతో ఆదరించారు. చంద్రబాబు గారిని 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ముఖ్యమంత్రిగా ఆయన నియోకవర్గంలోని ప్రతి గ్రామం తిరగడం సాధ్యం కాదు కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకున్నాను. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇక్కడ పర్యటిస్తున్నాను. గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి నా వంతు కృషి చేస్తున్నాను. గత ప్రభుత్వంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశాం. రాష్ట్రాన్ని బాగుచేయడం చంద్రబాబు గారి వల్లే అవుతుందనే నమ్మకంతో ప్రజలు గెలిపించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. నేను గతంలో పబ్లిక్ గా మాట్లాడింది లేదు. హెరిటేజ్ వ్యవహారాలు మాత్రమే చూసుకునేదాన్ని. నిజం గెలవాలి యాత్ర చేపట్టినప్పుడు రాష్ట్ర ప్రజలు , టీడీపీ నేతలు, కార్యకర్తలు నన్ను ముందుండి నడిపించారు. వారు అందించిన సహకారం నేను ఎప్పటికీ మర్చిపోలేను. సమాజం అభివృద్ధి చెందడంలో మహిళలదే ముఖ్యపాత్ర. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండటం శుభ పరిణామం. వారు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. మహిళల ఆర్థిక ఉన్నతికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. పురుషులు తమ వృత్తిలో రాణించాలంటే కుటుంబ మద్దతు ఎంతో అవసరం. ప్రజాసేవలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు నేను, మా కోడలు బ్రాహ్మణి పూర్తి సహకారం అందిస్తామని నారా భువనేశ్వరి తెలిపారు. కుప్పానికి పరిశ్రమల రాకతో ఉపాధి అవకాశాలు ఒక పరిశ్రమ పెట్టే ముందు పారిశ్రామికవేత్తలు లాభ,నష్టాలు బేరీజు వేసుకుంటారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదు. కూటమి ప్రభుత్వంలో వచ్చాక సీఎం చంద్రబాబు గారి పాలనదక్షతపై నమ్మకంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కుప్పం నియోజకవర్గానికి రూ. 7,121 కోట్ల విలువైన పెట్టుబడులతో 17 పరిశ్రమలు తీసుకొచ్చారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమందికి ఉపాధి లభిస్తుంది. ఇప్పటికే నియోజకవర్గంలో రూ. 2,203 కోట్ల పెట్టుబడులతో 7 పరిశ్రమలు స్థాపించారు. వీటి ద్వారా 7093 మందికి ప్రత్యక్షంగా, 15,237 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కుప్పంలో అడిడాస్ కంపెనీ ఫుట్ వేర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. మహిళలు స్వయం సమృద్ధి సాధించడం కోసం చంద్రబాబు గారు ఎలీప్ సంస్థను కుప్పానికి తీసుకొచ్చారు. ఇందులో శిక్షణ తీసుకున్న మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. కుప్పానికి హంద్రినీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకొచ్చారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపట్టారు. స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేశారు. చెత్త ద్వారా సంపద సృష్టికి చర్యలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ స్పోర్ట్ కాంప్లెక్స్ తెచ్చారు. మంకలదొడ్డి గ్రామానికి రోడ్ కనెక్టివిటీ నిమిత్తం రూ. 4 కోట్లకు పైగా వ్యయంతో బీటీ రోడ్లు వేశారని నారా భువనేశ్వరి తెలిపారు. కుప్పం మండలం టి.సదుమూరు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన నారా భువనేశ్వరి చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. టి.సదుమూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.