ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపిరి

చంద్రబాబు విజన్‌తో అభివృద్ధి దిశగా భారీ అడుగు

గోదావరి పుష్కరాల నాటికి ఏపీని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. పర్యాటకులు పెరిగేలా ప్రణాళికలు రచించాలని ఆదేశించారు. బారువ నుంచి నెల్లూరు వరకూ బీచ్‌ల అభివృద్ధితోపాటు పర్యాటకుల కోసం హోటళ్లు, హోంస్టేలు పెంచేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే కారవాన్ పార్కులు... టెంట్ సిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో పెరుగుతోన్న పర్యాటకుల ఫుట్ ఫాల్‌కు అనుగుణంగా ఏపీలో హోటల్ గదులు, హోం స్టేలను త్వరితగతిన అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యాటక శాఖకు దిశానిర్దేశం చేశారు. 2029 నాటికి రాష్ట్రంలో 50 వేల హోటల్ గదుల నిర్మాణం లక్ష్యాన్ని చేరుకోవాలని సీఎం సూచనలు జారీ చేశారు. అలాగే వివిధ పర్యాటక ప్రాంతాల్లో 10 వేలకు పైగా హోం స్టేలు కూడా అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. హోంస్టేలను అందుబాటు లోకి తీసుకువచ్చే అంశంపై ఎలాంటి పరిమితీ లేదని వివరించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రి కందుల దుర్గేష్, ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ సహా పర్యాటక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదం తెలియజేసిన టూరిజం ప్రాజెక్టులు వేగంగా ఏర్పాటు అయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. 15 ప్రాంతాల్లో కారవాన్ పార్క్‌లు ఏర్పాటు చేయాలి రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలు, నగరాల్లో జాతీయ, అంతర్జాతీయ హోటల్ బ్రాండ్లు వచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. గోదావరి పుష్కరాల నాటికి కూడా రాజమహేంద్రవరం సహా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హోం స్టేల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. హోం స్టేల నిర్వహణకు సంబంధించి రేటింగ్ కూడా పెట్టాలని దిశానిర్దేశం చేశారు. అరకు, చింతపల్లి, ముంచింగిపుట్టు, గాంధీవనం, మారేడుమిల్లి తదితర ప్రాంతాలతో పాటు కనీసం 10-15 ప్రాంతాల్లో కారావాన్ పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. కారావాన్లను పార్కింగ్ చేసుకుని కుటుంబంతో సురక్షితంగా ప్రకృతిని ఆస్వాదించేలా ఆయా పార్కుల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఎక్స్ పీరియన్స్ కేంద్రాల వద్ద కూడా ఈ తరహా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. తిరుపతి, విశాఖలలో అమ్యూజ్ మెంట్ పార్కుల ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సీఎం సూచనలు జారీ చేశారు. అటవీ, దేవాదాయ శాఖల సమన్వయంతో ఎకో, టెంపుల్ టూరిజానికి ప్రోత్సాహం ఇచ్చేలా ప్రాజెక్టులు చేపట్టాలని సీఎం పేర్కొన్నారు. ప్రసాద్, స్వదేశ్ దర్శన్ పథకాల కింద వివిధ దేవాలయాలు, దర్శనీయ స్థలాల అభివృద్ధికి చేపట్టిన ప్రాజెక్టులను 2026 మే నాటికి సిద్ధం చేయాలని అన్నారు. దీనికి సంబంధించి మరో రూ.663 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు పర్యాటక శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గండికోట, సూర్యలంక, అరకు బొర్రా గుహలు తదితర ప్రాంతాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలన్నారు. గోదావరి పుష్కరఘాట్‌ను ఆగస్టు నాటికి, హావ్ లాక్ బ్రిడ్జిపైకి పర్యాటకులను అనుమతించేలా ఈ ఏడాది డిసెంబరు నాటికి పనులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పర్యాటక ప్రోత్సాహానికి సీఎస్ అధ్యక్షతన కమిటీ రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఓ బోర్డు లేదా కమిటీ ఏర్పాటు చేసి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాలని సీఎం దిశానిర్దేశం చేశారు. పర్యాటకశాఖ, అటవీ, దేవాదాయ, పోలీసు, మెరైన్ ఇలా వేర్వేరు శాఖల సమన్వయం కోసం సీఎస్ అధ్యక్షతన దీనిని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. హౌస్ బూట్లు, హెలీ టూరిజంతో పాటు ఉడాన్ పథకం కింద సీ ప్లేన్‌లను కూడా ప్రోత్సహించాలని అన్నారు. విశాఖ, విజయవాడ, శ్రీశైలం, గండికోట, కంభం చెరువు లాంటి చోట్ల వాటర్ ఏరో డ్రోమ్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని సూచించారు. సముద్ర విహారాన్ని ప్రోత్సహించేలా విశాఖ, నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టుల నుంచి క్రూజ్ నౌకలను కూడా నిర్వహించేలా చూడాలన్నారు. తెలంగాణా లాంటి ల్యాండ్ లాక్డ్ రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు దీనికి పెద్ద ఎత్తున ఆకర్షితులు అవుతారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.