
సాక్షి డిజిటల్ న్యూస్ : పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని సృష్టించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అందుకే భారత ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని వనరుల నుంచి గ్యాస్, ముడి చమురును సేకరించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని సృష్టించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అందుకే భారత ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని వనరుల నుంచి గ్యాస్, ముడి చమురును సేకరించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పారు. ప్రధాని మోదీ మంగళవారం రోజున రాజ్యసభలో పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై మాట్లాడారు. పశ్చిమాసియాలో యుద్ధం ఆందోళన కలిగిస్తోందని... చర్చలు, దౌత్యం ద్వారా ఆ ప్రాంతంలో శాంతిని నెలకొలని భారతదేశం కోరుకుంటోందని చెప్పారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్దం వల్ల నెలకొన్ని ఉద్రిక్తతలను తగ్గించడం, హర్మూజ్ జలసంధి తెరిచేలా చూడటమే భారత లక్ష్యమని చెప్పారు. అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేలా అన్ని పక్షాలను ప్రోత్సహించడమే భారత దేశ ప్రయత్నమని తెలిపారు. పశ్చిమా సియాలో సంక్షోభం ఎక్కువ కాలం కొనసాగితే... తీవ్ర పరిణామాలు తప్పవని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఇంధన భద్రత కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాలపై ప్రధాని మోదీ మాట్లాడుతూ... గత 11 ఏళ్లలో 53 లక్షల మెట్రిక్ టన్నుల వ్యూహాత్మక చమురు నిల్వలను సృష్టించామని, అదనంగా 65 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంపై పనులు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. అంతేకాకుండా నౌకల తయారీకి ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టును ప్రారంభించిందని ఆయన తెలిపారు. హర్మూజ్ జలసంధిలోని నౌకల్లో చిక్కుకుపోయిన పలువురు భారతీయుల భద్రత పట్ల ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తే అవకాశం ఉన్న ఇంధన సంక్షోభం ముప్పును కూడా ఆయన ప్రస్తావించారు. అలాగే, గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న, ఉపాధి పొందుతున్న దాదాపు కోటి మంది భారతీయులకు రక్షణ కల్పించడం కూడా భారతదేశానికి తీవ్ర ఆందోళన కలిగించే అంశమేనని పేర్కొన్నారు.యుద్దం కారణంగా దిగుమతి-ఎగుమతి కార్యకలాపాలలో ఎదురయ్యే ఏవైనా ఇబ్బందులను అంచనా వేయడానికి, అవసరమైన పరిష్కారాలను రూపొందించడానికి నిరంతరం కృషి చేసే ఒక ఇంటర్ మినిస్టీరియల్ బృందాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసిందని మోదీ తెలిపారు. ఈ బృందం క్రమం తప్పకుండా సమావేశమవుతుందని చెప్పారు. వివిధ రంగాలలో సవాళ్లను ఎదుర్కోవడానికి కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిపుణులు, అధికారులతో కూడిన సాధికార బృందాలను ఏర్పాటు చేసినట్లే... ఇప్పుడు కూడా పరిస్థితులను సమన్వయం చేసుకోవడానికి నిన్ననే ఏడు కొత్త సాధికార బృందాలను ఏర్పాటు చేశారని తెలిపారు. సప్లై చైన్‌లు, పెట్రోలియం, డీజిల్, ఎరువులు, సహజ వాయువు, ద్రవ్యోల్బణం వంటి కీలక సమస్యలపై తక్షణ, దీర్ఘకాలిక వ్యూహాల మార్గదర్శకత్వంలో చర్యలు తీసుకునే బాధ్యతను ఈ బృందాలకు అప్పగించనున్నట్టుగా చెప్పారు. ఈ సమిష్టి కృషి ద్వారా తాము ప్రస్తుత పరిస్థితులను సమర్థవంతంగా అధిగమించగలమని తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. "మనం ప్రతి సవాలును ఓర్పుతో, సంయమనంతో, ప్రశాంతమైన మనసుతో ఎదుర్కోవాలి... నిరంతరం మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఏర్పడే ప్రతి సవాలుకూ సిద్ధంగా ఉండాలి’’ అని ప్రజలను మోదీ కోరారు. దేశ ప్రజల సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యత అంశమని పేర్కొన్న మోదీ... ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.