తల్లిదండ్రుల సంరక్షణపై కేబినెట్ కీలక నిర్ణయం

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు, బిల్లులకు తాజాగా ఆమోదం కల్పించింది. ఇందులో తల్లిదండ్రుల బాగోగులు చూసుకోని ఉద్యోగుల జీతాల నుంచి డబ్బులు కట్ చేసి.. వారికి ఇవ్వడం.. గిగ్ వర్కర్లకు సంబంధించిన కీలక బిల్లుతోపాటు విద్వేషపూరిత ప్రసంగాలను నివారించడం, మెట్రో రైలు స్వాధీనం, లాయర్ల రక్షణ, కులగణన నివేదిక, రోహిత్ వేముల చట్టానికి సంబంధించిన పలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సాయంత్రం సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం .. పలు కీలక బిల్లులను ఆమోదించింది. రాష్ట్రంలో సామాజిక భద్రత.. శాంతి భద్రతలను పరిరక్షించడమే లక్ష్యంగా కొన్ని బిల్లులకు ఆమోదం తెలిపింది. తల్లిదండ్రుల సంరక్షణ బిల్లు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి ఈ వినూత్న బిల్లును ప్రవేశపెట్టింది. వయసు మీదపడి వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతోపాటు.. ప్రజాప్రతినిధుల వేతనాల నుంచి 15 శాతం లేదా రూ.10 వేలను.. ఇందులో ఏది తక్కువగా ఉంటే అది కట్ చేసి.. వాటిని నేరుగా తల్లిదండ్రులకు అందించేందుకు ఉద్దేశించిన బిల్లును రూపొందించగా.. తాజాగా అది కేబినెట్ ఆమోదం పొందింది. గిగ్ వర్కర్ల సంక్షేమానికి హామీ తెలంగాణలో సుమారు 4.2 లక్షల మంది గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫామ్ కార్మికులు (డెలివరీ బాయ్స్, డ్రైవర్లు) ఉన్నారు. ఈ గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ యాక్ట్ 2026ను తెలంగాణ మంత్రివర్గం ఆమోదించింది. దీని ప్రకారం గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్‌తోపాటు ఒక ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ నిధిని ఏర్పాటు చేయనున్నారు. ఇలా చేయడం వల్ల గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపుతో పాటు సామాజిక భద్రత కూడా లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. విద్వేష ప్రసంగాలను అడ్డుకునే బిల్లు తెలంగాణ రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు.. అదే సమయంలో సోషల్ మీడియాలో పెరిగిపోతున్న విద్వేషపూరిత, రెచ్చగొట్టే పోస్టులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన బిల్లును తీసుకువచ్చింది. తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026ను తాజాగా తెలంగాణ కేబినెట్ ఆమోదించింది. విద్వేషపూరితమైన ప్రసంగాలు.. అల్లర్లను ప్రేరేపించే విధంగా చేసే వ్యాఖ్యలను కట్టడి చేసేందుకు ఈ బిల్లు ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేయనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మతాల మధ్య కొంతమంది చిచ్చు పెట్టేందుకు చేసే ప్రయత్నాలను అడ్డుకోవడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని తెలిపాయి. హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం హైదరాబాద్‌లోని 69 కిలోమీటర్ల ఫేజ్-1 మెట్రో వ్యవస్థను ఎల్ అండ్ టీ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. దీని కోసం రూ.15 వేల కోట్లను చెల్లించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు నోడల్ ఏజెన్సీగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్)ను నియమించింది. లాయర్ల రక్షణ బిల్లు రాష్ట్రంలో లాయర్లపై రోజురోజుకూ పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును తీసుకువచ్చిన ప్రభుత్వం.. తాజాగా దానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతుల హత్య వంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు న్యాయవాదులకు తగిన భద్రత కల్పించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. కులగణన నివేదిక, రోహిత్ వేముల చట్టం రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ ఇచ్చిన రిపోర్టును రాష్ట్ర మంత్రివర్గం పరిశీలించింది.