
జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్లోని పశుపోషకులు, చిన్న తరహా డైరీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పట్టణ ప్రాంతాల్లో పశువుల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు, రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని పశుపోషకులు, చిన్న తరహా డైరీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పట్టణ ప్రాంతాల్లో పశువుల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు, రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. డెయిరీ ఫారాలు, గొర్రెలు, మేకలు, పందుల పెంపకందారులు చెల్లించాల్సిన బెటర్మెంట్, డెవలప్మెంట్ ఛార్జీలను రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేస్తూ పశుపోషకులు, చిన్న రైతులకు పెద్దఎత్తున ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన జీవో ప్రకారం.. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు (ఖూదీం), పట్టణ అభివృద్ధి సంస్థలు పరిధిలో డెయిరీ ఫారాలు, గొర్రెలు/మేకల పెంపకం కేంద్రాలు, పందుల పెంపకం యూనిట్లు, ఇతర పశుసంవర్ధక ఫారాలకు బెటర్మెంట్ చార్జీలు, డెవలప్మెంట్ చార్జీల నుంచి పూర్తిగా మినహాయింపు మంజూరు చేసినట్టుగా తెలిపారు. అదేవిధంగా ఈ ఫారాలకు భవన అనుమతి/లైసెన్స్ రుసుమును గ్రామ పంచాయతీల్లో వసూలు చేసే రుసుముకు సమానంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా పట్టణ ప్రాంతాల్లో పశుపోషణపై ఆధారపడిన రైతులు, చిన్న వ్యవసాయదారులకు ఆర్థిక భారం గణనీయంగా తగ్గి వారి జీవనోపాధి మెరుగుపడుతుందని అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే, మరింత మందికి స్వయం ఉపాధి, సమృద్ధి లభిస్తుందని పేర్కొన్నారు. గత జూన్ నెలలో సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సాధారణంగా మున్సిపాలిటీల పరిధిలో నిర్మాణాలకు సంబంధించి డెవలప్మెంట్ ఛార్జీల రూపంలో భారీగా ఖర్చవవుతుంది. ముఖ్యంగా గొర్రెలు, మేకల పెంపకందారులు షెడ్ల కోసం అనుమతులు తీసుకోవడం ఇబ్బందితో కూడుకున్నది. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో లైసెన్స్ ప్రక్రియ సులభతరం కావడమే కాకుండా పశుపోషకులు, చిన్న తరహా డైరీ రైతులకు వేల రూపాయల ఆదా అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.