అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనున్న బీఆర్ఎస్: కేటీఆర్ ప్రకటన

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లను ప్రవేశపెట్టేందుకు బీఆర్ఎస్ సిద్దమైంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లను ప్రవేశపెట్టేందుకు బీఆర్ఎస్ సిద్దమైంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటన చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తెలిపిన కేటీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టుగా తెలిపారు. ఆరు గ్యారంటీల పేర్లు చెప్పి అడ్డగోలుగా ఓట్లు వేయించుకొని రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వంపైన ఒత్తిడి తేవడానికి ఈ ప్రవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడుతున్నామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తొలి రోజే ఆరు గ్యారంటీల అమలు ఫైల్‌పైన సంతకం చేశారని అన్నారు. ఆ తర్వాత అసెంబ్లీలో అప్పటి గవర్నర్‌తో చెప్పించారని తెలిపారు. అయితే 800 రోజులైనా 6 గ్యారంటీలో అమలకు అతిగతీలేదని ఆరోపించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడుతున్నామని తెలిపారు. స్పీకర్ కార్యాలయం, మండలిలో చైర్మన్ కార్యాలయంకు వెళ్ళి ఈ బిల్లును అనుమతించాలని కోరుతామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపైన కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ ప్రవేట్ మెంబర్ బిల్లును సభలో అనుమతించాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రభుత్వం ఆమోదించి ప్రజల పట్ల చిత్తశుద్ధిని చాటుకుందని అన్నారు. ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రభుత్వాలు ఆమోదించే సాంప్రదాయం ఇప్పటికే రాష్ట్రంలో ఉందని తెలిపారు. అందుకే ఈ ఆరు గ్యారెంటీల అమలు కోసం తాము పెడుతున్న ప్రైవేటు మెంబర్ బిల్లును కాంగ్రెస్ పార్టీ ఆమోదించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు యువకులు ఇలా ప్రతి ఒక్క వర్గం తరఫున ఈ బిల్లును మేము ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. ఈ బిల్లు చట్టం అయితే రైతన్నలకు రైతుబంధు ఎగ్గొట్టడానికి ప్రభుత్వానికి వీలుండదని అన్నారు. ఈ చట్టం వలన అన్నదాతలకు, ఆటో అన్నలకు, మహిళలకు, విద్యార్థులకు ప్రతి ఒక్కరికీ లబ్ధి కలుగుతుందని చెప్పారు. ఈ బిల్లును తాము ప్రవేశపెట్టిన తర్వాత అన్ని పార్టీల నేతలను కలుస్తాము, మద్దతు ఇవ్వాలని కోరుతామని తెలిపారు. అవసరమైతే లేఖలు రాస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇలా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఈ బిల్లు అమలు కోసం స్థానిక ఎమ్మెల్యేలపైన ఒత్తిడి చేయాలని కేటీఆర్ అన్నారు. ఈ బిల్లుకు సంబంధించి కూడా ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని తెలిపారు. ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ బిల్లును అసెంబ్లీలో అనుమతించి చట్టంగా మార్చాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ శాసనసభలో అనుమతించకుంటే చట్టపరంగా ఉన్న ఇతర మార్గాలను కూడా ఉపయోగించుకుంటామని తెలిపారు.