కేటీఆర్‌తో సహా బీఆర్ఎస్ నేతలను కలిసిన మంత్రి తుమ్మల

జనం న్యూస్: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం రోజున బీఆర్ఎస్ నేతలను కలిశారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం రోజున బీఆర్ఎస్ నేతలను కలిశారు. బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి... సిద్దిపేట జిల్లాలో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారం ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా నర్మేటలో నూతనంగా నిర్మించిన టీజీ ఆయిల్‌ఫెడ్ ఆయిల్‌పామ్ కర్మాగారంను ఈ నెల 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొంటారు. ఇదే వేదికపై నుంచి సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను సైతం విడుదల చేయనున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇది వరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ నెల 20 నుంచి 22 వరకు నూతనంగా నిర్మించిన ఆయిల్ ఫ్యాక్టరీ ఆవరణలో వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో రైతు మహోత్సవం కూడా నిర్వహించనున్నారు. నర్మేట్టలో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఆహ్వానించారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర నేతలను కలిసి ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సిద్దిపేట జిల్లాలోని నర్మెట శివారులో రాష్ట్రంలోనే మొట్టమొదటి రిఫైన్డ్ పామాయిల్ ఫ్యాక్టరీని అందుబాటులోకి తీసుకోస్తుంది.తెలంగాణ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో సుమారు 62 ఎకరాల సువిశాల స్థలంలో, రూ.300 కోట్ల వ్యయంతో ఈ కర్మాగారాన్ని నిర్మించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన లేటెస్ట్ టెక్నాలజీని ఇక్కడ వినియోగిస్తున్నారు. కేవలం ముడి నూనె తీయడమే కాకుండా, అక్కడే రిఫైనరీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. అంటే గెలల నుంచి నూనె తీయడం దగ్గరి నుండి, దానిని శుద్ధి చేసి ప్యాకెట్ల రూపంలో మార్కెట్లోకి పంపే వరకు అన్ని పనులు ఇక్కడే జరుగుతాయి.