
అక్షర ఆయుధం : బారామతి అసెంబ్లీ స్థానం నుంచి మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి సునేత్రా పవార్ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...బారామతి అసెంబ్లీ స్థానం నుంచి మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి సునేత్రా పవార్ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం రోజున పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంతో పాటు తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సోం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలోని వివిధ రాష్ట్రాలలో పలు కారణాలతో ఖాళీ అయిన 8 అసెంబ్లీ స్థానాలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. అందులో మహారాష్ట్రలోని బారామతి, రాహురి స్థానాలు కూడా ఉన్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2024లో బారామతి నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించగా... ఆ స్థానానికి కూడా ఉప ఎన్నిక షెడ్యూల్ను ప్రకటించింది. బారామతి ఉప ఎన్నికకు మార్చి 30న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా, ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించనున్నారు. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే బారామతి నుంచి సునేత్రా పవార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తుంది.అజిత్ పవార్ మరణం తర్వాత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సునేత్రా పవార్. బారామతి ఉప ఎన్నికలో ఎన్డీయే కూటమిలోని ఎన్సీపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. అయితే దివంగత అజిత్ పవార్ పట్ల గౌరవ సూచకంగా... ఎన్సీపీ - శరద్ పవార్ సహా ప్రతిపక్ష ఎంవీఏ బారామతిలో అభ్యర్థిని నిలబెట్టకూడదని నిర్ణయాలు తీసుకున్నాయి. తాజాగా ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి చెందిన సుప్రియా సూలే ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.ఢిల్లీలో సుప్రియా సులే మాట్లాడుతూ... ‘‘బారామతి ఉప ఎన్నికలో NCP (SP) పోటీ చేయదని నేను ఇప్పటికే స్పష్టం చేశాను. మా వదిన సునేత్రపై మేము మా అభ్యర్థిని పోటీకి నిలపము. ఇక రాహురి అసెంబ్లీ స్థానం విషయానికి వస్తే... ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA) భాగస్వామ్య పక్షాలు చర్చించి, రాబోయే ఒకటి రెండు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటాయి’’ అని తెలిపారు.ఇదిలాఉంటే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం రోజున మాట్లాడుతూ... బారామతి, రాహురి అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అయితే, ఒకవేళ పోటీ అనివార్యమైతే దానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన స్పష్టం చేశారు.