
సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు గతంలో చంద్రబాబు ఎన్ని కుట్రలు చేశారో, ఎన్ని లేఖలు రాశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ నీటి హక్కులను కాపాడాలి’ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’ అని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. చేతకాని, బాధ్యతలేని, ముందుచూపు లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరి వల్ల కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా హాల్లో శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. నీటి హక్కుల సాధనలో గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషిని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు. కాంగ్రెస్ మొద్దు నిద్రను వదిలించేందుకే బీఆర్ఎస్ పక్షాన పదేపదే నిలదీస్తున్నామని మాజీమంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. నీటి హక్కులను కేసీఆర్ కాపాడారు ‘సమైక్య రాష్ట్రంలో నీళ్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు గత తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నిరంతరం శ్రమించారు. కృష్ణా నదిలో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు కృష్ణా ట్రిబ్యునల్ సాధించి...నీటి పునఃపంపిణీ జరిగేలా చూశారు’అని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు.‘గోదావరి నదిలో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తెలంగాణకు ఉన్న హక్కులను కేసీఆర్ శాశ్వతంగా కాపాడారు.గోదావరిలో ఉన్న 1400 టీఎంసీల నీటిలో 968 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు ఏపీకి కేటాయించారు. మన 968 టీఎంసీల హక్కులను స్థిరపరచడానికి యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులు కట్టి, 400 టీఎంసీల ప్రాజెక్టులకు అనుమతులు సాధించిన ఘనత కేసీఆర్‌దే’అని మాజీమంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి చేతకానితనం గోదావరి జలాలపై పడింది ‘కేంద్రంలో ఉన్న బీజేపీ, ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి అని మాజీమంత్రి హరీశ్ రావు ఆరోపించారు.‘కృష్ణాలో నీటి దోపిడీ చేసిన ఏపీ.. ఇప్పుడు ఆదమరిచి నిద్రపోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ చేతకానితనాన్ని ఆసరాగా చేసుకుని గోదావరి జలాలపై పడింది. మేము ప్రతిపక్షంగా నిలదీసిన ప్రతిసారీ ఉలిక్కిపడి లేచి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాస్తోంది. బహుశా ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగాను కాబట్టి, సాయంత్రానికి మళ్లీ ఏదైనా లేఖ రాసే డ్రామా ఆడుతుందేమో?అని ఎద్దేవా చేశారు. ‘జనవరి 30న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఆ మీటింగ్ ద్వారా తెలంగాణ నీటి హక్కులను హరించేందుకు ఏపీ పక్కా స్కెచ్ వేసింది.కేంద్రంలోని బీజేపీ అండ చూసుకుని గోదావరి నీళ్లను దోచుకునేందుకు టీడీపీ ప్లాన్ చేసింది. గోదావరిలో ఏ రాష్ట్రానికీ బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయలేదని ఏపీ వాదించడం దుర్మార్గం.ఢిల్లీ మీటింగ్‌కు సంబంధించిన మినిట్స్ ఫిబ్రవరి 12నే రాష్ట్రానికి వచ్చాయి. ఈరోజు మార్చి 16. నెల రోజులు దాటిపోయినా అందులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు? రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టారా? లేక దాసోహం అయ్యారా?’అని మాజీమంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ దొంగ చేతికే తాళాలు ఇచ్చింది ‘గోదావరి, బనకచర్ల అంశాలు ఎజెండాలో లేకపోతేనే ఢిల్లీ మీటింగ్‌కు వెళ్తామని ముందు చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం...ఏపీ ప్రభుత్వం పోలవరం, నల్లమల్ల సాగర్ అంశాలను ఎజెండాలో పెట్టినా కూడా మోకాళ్ల మీద పరిగెత్తుకుంటూ వెళ్లి మీటింగ్‌లో కూర్చుంది’అని మాజీమంత్రి హరీశ్ రావు ఘాటుగా విమర్శించారు.‘తెలంగాణకు ద్రోహం చేసిన ఆదిత్యనాథ్ దాస్‌ను చైర్మన్‌గా చేసి దొంగ చేతికే తాళాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీటింగ్ మినిట్స్ పేజీ 3లో రాష్ట్రాల మధ్య గోదావరి జలాల కేటాయింపులు అసలు లేవని ఏపీ స్పష్టంగా చెప్పినట్లు ఉంది. దీనిపై ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించలేదంటే, తెలంగాణకు వాటా లేదని అంగీకరించినట్టే కదా? బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు చేయకపోతే గోదావరిపై పలు రాష్ట్రాలలో సెంట్రల్ వాటర్ కమిషన్ 76 ప్రాజెక్టులకు ఎలా అనుమతులు ఇచ్చింది? ట్రిబ్యునల్ అవార్డును ప్రశ్నించే హక్కు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఎక్కడిది?’అని మాజీమంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఏపీ సర్కార్ ట్రిబ్యునల్‌ను ధిక్కరించింది ‘ఏపీ సర్కార్ ట్రిబ్యునల్‌ను ధిక్కరించడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమే, తెలంగాణ హక్కులను కాలరాయడమే.బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చాం. అప్పుడు ఏపీకి 531 టీఎంసీల వాటా ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సీతారామ ప్రాజెక్టుకు (67 టీఎంసీలు) సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది’అని మాజీమంత్రి హరీశ్ రావు తీవ్రఆరోపణలు చేశారు. ‘జూన్ 2023లో సీడబ్ల్యూసీ ఇచ్చిన రిపోర్టులో గోదావరిలో 3396 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని, అందులో ఏపీ వాటా పోనూ మిగిలినవన్నీ తెలంగాణవేనని స్పష్టం చేసింది.కానీ ఇప్పుడు ఏపీ ఏకంగా 775 టీఎంసీలు కావాలని కొట్లాడుతోంది.కృష్ణా నదిలో కనీసం 34 శాతం తాత్కాలిక వాటాను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకోలేకపోతోంది’అని మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.