పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు కొత్త ‘3C ఫార్ములా’

★ కమిట్‌మెంట్, కన్విన్స్, కో-ఆపరేట్

సాక్షి డిజిటల్ న్యూస్ : ఏదైనా జిల్లాల్లో పరిశ్రమలు రాకుంటే జిల్లాలను ప్రమోట్ చేయండి. ఏదో ఒక రంగంలో ఆయా జిల్లాలకున్న ప్రత్యేకతలను, అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని ఆయా రంగాల్లో అభివృద్ధి చేయాలి. జిల్లాలకున్న అడ్వాంటేజీలను ప్రమోట్ చేసి పెట్టుబడులను ఆకర్షించాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పెట్టుబడులు రాబట్టడం ఆయా శాఖలకు సంబంధించిన అంశంగా కాకుండా... జిల్లా కలెక్టర్లు కూడా బాధ్యతగా తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు పెట్టుబడులు రాబట్టుకునేలా సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల్లో పెట్టబుడులను రాబట్టేలా కలెక్టర్లు కమిట్మెంట్‌తో పెట్టుబడిదారులను అన్వేషించి... పెట్టుబడులు పెట్టేందుకు కన్విన్స్ చేసి... ముందుకు వచ్చిన వారికి పూర్తిగా కో-ఆపరేట్ చేయాలంటూ జిల్లా కలెక్టర్లకు 3C ఫార్మూలను సీఎం చంద్రబాబు నిర్దేశించారు. 6వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజున ముఖ్యమంత్రి వివిధ అంశాలపై సమీక్షించారు. పెట్టబుడి, టూరిజం శాఖలపై జరిగిన చర్చలో సీఎం కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ పేరుతో అభివృద్ధి ‘రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను వేగంగా గ్రౌండ్ అయ్యేలా చర్యలు చేపట్టాలి. పెట్టుబడులను ఆకర్షించేలా జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. పెట్టుబడులు వస్తే... స్థానికంగా యువతకు ఉపాధి, ప్రజల తలసరి ఆదాయం పెరుగుతాయి’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.‘విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ పేరుతో అభివృద్ధి చేస్తున్నాం. విశాఖ రీజిజయన్ కు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, అమరావతికి పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్, తిరుపతి రీజియన్ కు ముఖేష్ కుమార్ మీనా బాధ్యత వహిస్తారు. రీజియన్ల వారీగా పరిశ్రమలు, పెట్టుబడులు, ఆయా ప్రాంతాల ఆర్థికాభివృద్ధి బాధ్యతను ఈ అధికారులు తీసుకుంటారు. పెట్టుబడులపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు సమీక్షించి ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేందుకు తక్షణం చర్యలు చేపట్టాలి. అనుమతులు వేగంగా ఇవ్వటంతో పాటు భూ కేటాయింపులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చూడాలి. పరిశ్రమలకు నీటిని ఇస్తేనే వేగంగా ఉత్పాదన ప్రారంభిస్తారు. ఓర్వకల్లులో పారిశ్రామిక క్లస్టర్ రూపకల్పన చేశాం. ఇప్పుడు ఎయిర్ పోర్టు లాంటి మౌలిక సదుపాయాలు కూడా వచ్చాయి. ఇప్పుడు భవిష్యత్తులో ఓ మేజర్ పారిశ్రామిక హబ్ గా మారుతుంది. కడప జిల్లాలో కొప్పర్తి కూడా ఆ పారిశ్రామిక క్లస్టర్ గా తయారు కావాలి’అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. పెట్టుబడులపై జిల్లాల్లోనూ సమావేశాలు పెట్టాలి ‘పెట్టుబడులపై జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహించాలి. పెట్టుబడులు రాబట్టేందుకు కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంపై జిల్లాల వారీగా ర్యాంకులిస్తాం. 2019-24లో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు’అని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.‘అమర్ రాజా కంపెనీ తిరుపతిలో కార్పోరేట్ ఆఫీస్ పెట్టింది... వారినీ గత పాలకులు పారిపోయేలా చేశారు. 2014-19లో పరిశ్రమలకు ఇచ్చిన భూములను గత ప్రభుత్వం వేరే అవసరాలకు వాడేసింది’అని సీఎం చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.‘ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీని బెంగళూరుకు పోటీగా తీర్చిదిద్దాం. మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాం... ఎకో సిస్టం కల్పించాం. ఇప్పుడు ఆ ఫలితాలు హైదరాబాద్ అనుభవిస్తోంది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం అదే తరహా ఎకో సిస్టం ఏర్పాటు చేస్తున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.