మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం

స్వదేశానికి బయలుదేరిన 59 మంది ఆంధ్రులు

జనం న్యూస్: సౌదీ అరేబియాలో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను ఏపీ ఎన్ఆర్టీఎస్, ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం స్వదేశానికి రప్పించేందుకు చేసిన కృషి ఫలించింది. సౌదీలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న 59 మంది ప్రవాసాంధ్రులను ఇండియాకు తరలించారు. వీరిలో బహ్రెయిన్‌లో ఉన్న వారు సైతం ఉన్నారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికాలు యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. గత పది రోజులుగా యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ప్రభావం గల్ఫ్ దేశాలపై కూడా పడింది. గల్ఫ్ దేశాల్లో భారత దేశానికి చెందిన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉద్యోగ రీత్యా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రవాసాంధ్రులు ఎప్పుడు ఏ బాంబు వచ్చి తమ మీద పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలలో భారతీయులు గాయపడినట్లు వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఏపీఎన్ఆర్‌టీ, ఎన్ఆర్ఐ టీడీపీల ఆధ్వర్యంలో గల్ఫ్‌లో చిక్కుకున్న 59మంది తెలుగు ప్రజలు మంగళవారం రాత్రి క్షేమంగా బయలు దేరారు. సౌదీ అరేబియా డమ్మాం ఎయిర్ పోర్టు నుంచి వారు విమానంలో పయనమయ్యారు. యుద్ధం కారణంగా తాత్కాలికంగా నిలిచిన విమానాల రాకపోకలు పాక్షికంగా పునఃప్రారంభమైన నేపథ్యంలో...గత 10రోజులుగా బహ్రెయిన్ తో పాటు వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న 59 మంది ఆక్కడ నుంచి సురక్షితంగా బయలు దేరారు. సౌదీలో చిక్కుకున్న ప్రవాసాంధ్రులు. ఇకపోతే సౌదీ అరేబియాలో చిక్కుకున్న ప్రవాసాంధ్రుల పరిస్థితి మొదట బహ్రెయిన్‌లోని ఏపీ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS), ఎన్ఆర్ఐ టీడీపీ విభాగానికి తెలిసింది. వెంటనే వారు అధికారులకు సమాచారం అందించి తక్షణ సహాయం కోరారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీ భవన్ కమిషనర్ అర్జా శ్రీకాంత్, ఏపీఎన్ఆర్టి చైర్మన్ వేమూరి రవికుమార్, సీఈఓ కృష్ణమోహన్ రంగంలోకి దిగి ఆయా దేశాల్లోని గుడ్ విల్ రాయబారులను అప్రమత్తం చేశారు. డమ్మాం నుంచి నడుస్తున్న విమానాలు. గల్ఫ్ కౌన్సిల్ ఎన్ఆర్ఐ టీడీపీ విభాగ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం బహ్రీన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో కూడిన ఆరు గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతం సుమారు 100 మంది ఏపీఎన్ఆర్టిఎస్ గుడ్ విల్ రాయబారులు చురుకుగా పనిచేస్తున్నారు. ఈ వాలంటీర్లు ఖతార్, కువైట్, బహ్రీన్ నుంచి సౌదీ అరేబియాకు వెళ్లాల్సిన తెలుగువారికి ట్రాన్జిట్ వీసాల జారీకి సహకారం అందించారు. సౌదీ అరేబియాలోని డమ్మాం నుంచి విమానాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. వారికి స్థానిక రవాణాను కూడా ఏర్పాటు చేశాం. చిక్కుకున్న ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోవడానికి వ్యక్తిగత వాహనాలు, ఇతర లాజిస్టిక్ సపోర్ట్ అందించినట్లు రాధాకృష్ణ చెప్పారు.