
సాక్షి డిజిటల్ న్యూస్ : ‘వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగంలో కేపీఐలు మెరుగు పడాలి. రూ.20 లక్షల కోట్లకు స్థూల ఉత్పత్తి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 15.1 శాతం మేర వృద్ధిరేటు లక్ష్యాన్ని కూడా సాధించేలా చర్యలు చేపడుతున్నాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.ప్రభుత్వం బిలియనీర్ల కోసం పని చేయడం లేదని.. పేదల కోసం పని చేస్తోందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ సహా వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలి. ఎక్కడా చిన్న పొరపాటు కూడా దొర్లకుండా పారదర్శకంగా అమలు చేయాలి అని దిశానిర్దేశం చేశారు. ఐటీ, క్వాంటం, ఏఐ వంటి రంగాల్లో కొత్త టెక్నాలజీలు, ల్యాబులు ఏర్పాటు చేస్తున్న తరహాలోనే.. వ్యవసాయానికి మరింత ఊతమిచ్చేలా అలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ క్రమంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేద్దామని సీఎం ప్రకటించారు. రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సమావేశం బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజల్లో ప్రచారం కల్పించాలని.. అలాగే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఇదే సందర్భంగా ఇటీవల జరిగిన వివిధ ఘటనలపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వేట్లపాలెం బాణాసంచా పేలుళ్లు, శ్రీకాకుళంలో డయేరియా, రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనల్లో అధికార యంత్రాంగం అలక్ష్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కోసమే కూటమి ప్రభుత్వం ప్రభుత్వం బిలియనీర్ల కోసం పని చేయడం లేదని.. పేదల కోసం పని చేస్తోందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ప్రతీ మూడు నెలలకూ పాలనా అంశాలపై సమీక్ష చేసుకుని ముందుకు వెళ్తున్నాం. ఉన్న పరిమిత వనరులతోనే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్సు చేస్తున్నాం.గతంలో కార్యాలయాల్లో కూర్చుని ఫైల్స్ రాసే పరిస్థితి నుంచి వర్చువల్ పని విధానాన్ని తీసుకువచ్చాం. గడచిన 20 నెలల్లో కీలకమైన పాలనా మార్పులు తీసుకువచ్చాం. ప్రభుత్వం తెచ్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తాయి. వీటి అమలులో ఉదాసీనత వద్దు’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.‘2047 స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా తెచ్చిన 10 సూత్రాలు అమలు చేస్తే సుపరిపాలన అందించేందుకు వీలవుతుంది. నిర్దేశిత లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రభావవంతంగా అమలు చేయాలి. సూపర్ సిక్స్ సహా వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలి. ఎక్కడా చిన్న పొరపాటు కూడా దొర్లకుండా పారదర్శకంగా అమలు చేయాలి. 13 తేదీన అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు విడుదల చేస్తున్నాం. కేంద్రం ఇచ్చే వాటితో పాటు రాష్ట్రం కూడా రైతుల ఖాతాల్లో మిగతా సొమ్ము జమ చేస్తుంది. రైతు సంఘాలు, సాగునీటి సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలు ఇలా వేర్వేరు ప్రతినిధులు రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని సమర్ధంగా తీసుకెళ్దాం. ప్రజల్లోకి వెళ్లి... ఈ పథకం గురించి చెప్పాలి.. డబ్బులు విడుదల చేస్తున్నామని వివరించాలి. ఖరీఫ్ సాగు కోసం మే 15 తేదీన నీటిని విడుదల చేస్తున్నాం.సీజన్లో ముందుగానే నీరు ఇస్తాం. మే 15 నుంచే సాగుకు సిద్దం అవుదాం. ఏఐ అగ్రానమిస్ట్ సేవలు కూడా అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీ వ్యవసాయ దారుడికి ఏఐ అగ్రానమిస్ట్ సేవలు అందేలా చర్యలు చేపట్టాలి’అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. భూ వివాదాలు లేకుంటే 70 శాతం సమస్యలు తీరినట్టే ‘ఉగాది కానుకగా 2.50 లక్షల లబ్దిదారులకు సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తాం. జూన్ నెలలో మరికొన్ని ఇళ్లను లబ్దిదారులకు ఇస్తాం. ఇల్లు, ఇంటి జాగా కూడా మూడేళ్లలో ఇవ్వాల్సి ఉంది. ఇంద్ర ధనస్సు పేరిట దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు మరికొన్ని కార్యక్రమాలు అమలు చేయబోతున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.‘గత పాలనలో ట్రూ ఆప్ పేరిట విద్యుత్ చార్జీల భారం వేశారు. తొలిసారి ట్రూ డౌన్ చేశాం. రూ.4,600 కోట్ల భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తోంది. ఈ ఏడాది 39 పైసల మేర విద్యుత్ కొనుగోలు ధర తగ్గిస్తాం. కుసుమ్ కింద 3 లక్షల పంప్ సెట్లు ఇస్తున్నాం. సబ్ స్టేషన్ యూనిట్ గా మైక్రో గ్రిడ్ ఏర్పాటుతో పాటు ప్రోజ్యూమర్ కాన్సెప్టును సమర్ధంగా అమలు చేయాలి. విద్యుత్ ఉత్పాదన ఓ సంపాదనా మార్గంగా మారాలి. విద్యుత్ వినియోగదారులు.. విక్రయదారులుగా మార్చేలా రూపొందించిన ప్రణాళికను సక్సెస్ చేయాలి. వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యూర్ కింద 1.12 లక్షల మంది మహిళా మైక్రో ఎంట్రప్రెన్యూర్లను తయారు చేశాం. వచ్చే ఏడాదికి 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దేలా లక్ష్యంగా పెట్టుకున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.