
అక్షర ఆయుధం : భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కొనడానికి పోలీసు శాఖ సర్వసన్నద్ధం కావలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాబోయే 25 సంవత్సరాలకు అవసరమైన కార్యాచరణపై చర్చించి ప్రణాళికలు రూపొందించుకోవాలని పోలీసు శాఖకు సూచించారు. ఆర్‌బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో సుదీర్ఘ కాలం తర్వాత నిర్వహించిన పోలీస్ ఆఫీసర్స్ రీట్రీట్-2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఫ్యూచర్ రెడీ కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాల పోలీసు ఉన్నతాధికారులు ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. పోలీసింగ్‌కు సంబంధించి భవిష్యత్తులో చేపట్టాల్సిన మార్పులు, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యల ఆవశ్యకతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తెచ్చారు. AI టెక్నాలజీని వినియోగించే అంశాన్ని పరిశీలించాలి.సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో కొత్త తరహా నేరాలు పెరగకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నేరాలను నిరోధించడం, నేరస్థులను త్వరగా గుర్తించడానికి AI టెక్నాలజీని వినియోగించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పోలీస్ అకాడమీ లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టంను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.‘శాంతి భద్రతలు కాపాడటంలో దేశంలో తెలంగాణ ఒక మెరుగైన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అందుకు పోలీసు శాఖను అభినందిస్తున్నా. అయితే 2047 లక్ష్యాలను చేరుకోవడానికి మనమంతా ఎంపవర్ కావలసిన అవసరం ఉంది. ఫ్యూచర్ రెడీ కోసం పోలీసు శాఖ చేసిన ప్రతిపాదనలు, అనుసరించాల్సిన విధానం, దానికి చట్ట బద్ధత కల్పించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శితో కూడిన కమిటీని నియమిస్తాం. ఆర్థిక, న్యాయ, సాంకేతిక, పరిపాలన పరమైన అంశాలను చర్చించిన తర్వాత చట్టరూపం కల్పించే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది’అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.రిలాక్స్‌లోకి వెళ్తే నష్టం జరుగుతుంది.‘పోలీసు శాఖను ఎంపవర్ చేయడానికి అవసరమైన నిధులు కేటాయించడంలో ఇబ్బంది లేదు. కానీ ఫలితాలొచ్చే విధంగా ఆ నిధులు సద్వినియోగం అవుతాయన్న ఒక విశ్వాసం కల్పించాలి. మనకున్న ఫిజికల్ క్రైమ్, మన ఎకోసిస్టమ్ ఆధారంగా మాన్యువల్స్ రాసుకున్నాం. ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. నేర స్వరూపమే పూర్తిగా మారిపోయింది. సైబర్ క్రైమ్, డ్రగ్స్ వంటి కొత్త సమస్యలొచ్చాయి’అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ‘పోలీసు అధికారులు మొట్టమొదట సమస్య ఏంటో అర్థం చేసుకోగలగితే సగం సమస్య పరిష్కారమైనట్టే. సమస్య అర్థంకానప్పుడు వేగంగా పరిష్కరించాలని ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు. ఉద్యోగం వచ్చింది కదా అని సమాజంతో పనిలేదన్న భావన రావొద్దు. బాధ్యత మరింతగా పెరిగిందని గుర్తించాలి. ఉద్యోగం వచ్చిందని ఆటో మోడ్‌లోకి వెళ్లి రిలాక్స్ అయ్యారంటే నష్టం జరుగుతుంది’అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.ప్రజలకు కష్టమెుస్తే సాయం కోసం ఎదురుచూసేది పోలీస్ కోసమే‘దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా లాంటి మెట్రోపాలిటన్ నగరాలు అనేక సమస్యలతో సతమతవుతున్నాయి. మెట్రో నగరాల్లోని పరిస్థితులను పోలీసు శాఖ ఖచ్చితంగా నేర్చుకోవలసిన అంశాలున్నాయి’అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.‘ప్రజలు సమస్య వచ్చినప్పుడు మొట్టమొదటగా సహాయం కోసం చూసేది పోలీసుల వైపే. అది పోలీసుల్లోని మంచి తనం కావొచ్చు. వ్యవస్థ కావొచ్చు. తీవ్రవాదం లేదా ఇతర సమస్యలను ఎదుర్కొనడానికి గ్రేహౌండ్స్, ఆక్టోపస్, నార్కోటిక్స్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఇలా రకరకాల వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం. సిబ్బంది విషయంలోనూ అనేక సమస్యలున్నాయి. తక్కువ జనాభా ఉన్న ప్రాంతానికి ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతానికి ఒకే విధంగా సిబ్బంది కేటాయించడంకన్నా జనాభా ప్రాతిపదికన సిబ్బంది రేషనలైజేషన్‌పై ఆలోచనలు చేయండి. శాఖాపరంగా చర్చించుకుని మానవ వనరులను ఒక పద్ధతి ప్రకారం వినియోగించుకోవాలి. ఒక పర్పస్ కోసం ఒక ఫోర్స్‌ను తయారు చేసిన తర్వాత ఆ పర్పస్ పరిష్కారమైన తర్వాత ఆ ఫోర్స్‌ను ఇతరత్రా వినియోగించడంపై సమీక్ష చేయాలి’అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.పోలీస్ శాఖ మానవీయ దృక్పథం కలిగి ఉండాలి.‘సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడమే కాకుండా నేర పరిశోధన, ఇతరత్రా పోలీసు శాఖలో ఉన్న సమాచారానికి సంబంధించిన డేటాను ICCC కంట్రోల్ రూమ్‌తో కనెక్ట్ చేయాలి. ఏ పోలీస్ స్టేషన్‌లో ఏ సమాచారం కావాలన్నా నిమిషాల్లో ఆన్‌లైన్‌లో పొందే విధంగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునేలా ఉండాలి’అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘ఉన్నతస్థాయిలో ఉన్న అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందితో అనుసంధానం ఏర్పాటు చేసుకోగలిగితే కిందిస్థాయిలో ఉండే సమస్యలు అర్థమవుతాయి. పోలీస్ శాఖ మానవీయ దృక్పథం కలిగి ఉండాలి. కింది స్థాయి సిబ్బందికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చినప్పుడే మంచి ఫలితాలు, గుర్తింపు వస్తుంది. 2002 సంవత్సరంలో పోలీస్ రిట్రీట్ కార్యక్రమం తర్వాత ఇప్పుడు మళ్లీ రిట్రీట్ జరుపుకుంటున్నాం. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, నేరాలు, నేరాల స్వరూపం చర్చించుకుని అవగాహన కల్పించినప్పుడు తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడుతుంది’అని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్ధేశం చేశారు.సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది‘ఏ సమస్య వచ్చినా ప్రజలు మొదట సహాయం కోసం ఎదురు చూసేది పోలీసుల కోసమే. ఒకప్పుడు తీవ్రవాదం ఒక సమస్యగా ఉండేది. దానిని ఎదుర్కోవడానికి ఆక్టోపస్, గ్రేహౌండ్స్ లాంటి వ్యవస్థలు తీసుకొచ్చాం. అవినీతిని నిరోధించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఫిజికల్ క్రైమ్ నిరోధించేందుకు ఇప్పటి వరకు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఇప్పుడు నేర స్వరూపమే మారిపోయింది. సైబర్ క్రైమ్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో మన సిస్టం ను అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది’అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.‘సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, రిక్రూట్ మెంట్, ఇతర అంశాలకు సంబంధించి వివిధ సమస్యల పరిష్కారానికి పోలీసు ఉన్నతాధికారులు కొన్ని ప్రతిపాదనలు అందించారు. వీటిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తాం. ఆ కమిటీలో విశ్లేషించి సాధ్యాసాధ్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటాం’అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.