కొత్తపాస్ పుస్తకాలకు క్యూఆర్ కోడ్ విధానం

ఎవరైనా రికార్డులు తారుమారు చేస్తే తెలిసిపోతుంది
★నంద్యాల సభలో సీఎం చంద్రబాబు నాయుడు

సాక్షి డిజిటల్ న్యూస్ : ‘రైతుల భూములకు భద్రత కల్పిస్తాం... రైతుల ఆదాయం పెంచుతాం. ఉచితంగా రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేస్తాం’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 2027 చివరి నాటికి అన్ని రకాల భూ వివాదాల పరిష్కారానికి ప్రయత్నం చేస్తామన్నారు. భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ పెడతాం... జైళ్లకు పంపుతాం అని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరించేలా ప్రణాళికాబద్దంగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎలాంటి భూ వివాదాలు లేకుండా చర్యలు తీసుకుని... ట్యాంపర్ చేయడానికి ఆస్కారం లేని విధంగా రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలోని రైతుల భూములకు భద్రత కల్పించడంతోపాటు... వారి ఆదాయాలు పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తబురుజులో మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు సీఎం అందించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు.‘గత ప్రభుత్వం రెవెన్యూ శాఖను అస్తవ్యస్తం చేసింది. నాడు మంత్రులే భూ కబ్జాలకు పాల్పడ్డారు. డోన్‌లో మంత్రిగా ఉన్న వ్యక్తి ఒక సాధారణ రైతు భూమిని తన అనుచరులకు కట్టబెట్టేశారు. గత ప్రభుత్వంలో 1.95 లక్షల ఎకరాలను 22ఏలో పెట్టారు. ప్రైవేట్ భూముల రికార్డులను తమ ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. అడిగిన భూమి ఇవ్వకపోతే 22ఏలో పెట్టేసేలా గత ప్రభుత్వం వ్యవహరించింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి ప్రైవేట్ భూములపై అజమాయిషీని సొంత వాళ్లకు కట్టబెట్టాలని చూశారు. అప్పీల్ కు వెళ్లడానికి వీలు లేకుండా నిబంధనలు చేశారు’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.‘ఇదే జిల్లా పాణ్యం నియోజకవర్గంలో నాటి ప్రభుత్వం తప్పుల తడకగా జారీ చేసిన పట్టాదారు పుస్తకాన్ని కాల్చి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామని హామీ ఇచ్చాను. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం. భూ రికార్డుల్లో తప్పులను సరిదిద్దుతున్నాం. వారసత్వంగా వచ్చిన భూములు, సొంత శ్రమతో కొనుగోలు చేసిన భూములకు చెందిన పుస్తకాలపై నాటి పాలకుల ఫోటోలు వేసుకున్నారు. ఫోటోల పిచ్చితో జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. సర్వే రాళ్లపైనా ఫోటోలు ముద్రించుకున్నారు... రూ.750 కోట్లు ఫోటోలకు ఖర్చు చేశారు. ఎక్కడెళ్లినా భూ సమస్యలపై కట్టకట్టలు అర్జీలు వచ్చాయి’అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రెవెన్యూ వ్యవస్థను గాడిన పెట్టేందుకు 20 నెలలు పట్టింది ‘వాళ్లు చేసిన ఒక దుర్మార్గాన్ని సరిదిద్దడానికి 20 నెలలు పట్టింది. రైతుల సమక్షంలోనే భూ కొలతలు తీసుకుని రైతుల ఆమోదంతో భూ వివరాలతో పుస్తకాలు ఇస్తున్నాం. భూ రికార్డులు తారుమారు చేయకుండా పక్కాగా పట్టా ఇస్తున్నాం. క్యూఆర్ కోడ్ విధానం తీసుకొచ్చాం. ఎవరు రికార్డులు తారుమారు చేసినా తెలిసిపోతుంది. ఎమ్మార్వో, వీఆర్వోలు తప్పు చేసినా బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా తెలిసిపోతుంది’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.‘మేం ఇచ్చిన పట్టాదార్ పుస్తకాలను ట్యాంపర్ చేయలేరు. వివాదాల్లేని పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇప్పించే బాధ్యత నాది. రాష్ట్ర వ్యాప్తంగా 16,816 గ్రామాలున్నాయి. 6,860 గ్రామాల్లో సర్వే గత ప్రభుత్వంలో చేశారు. తప్పుల తడకతో 19.93 లక్షల పుస్తకాలు ఇచ్చారు. రికార్డులు తారుమారు చేసి ఇచ్చారు. అవన్నీ పక్కనపెట్టి మళ్లీ కొత్తగా రైతులకు పుస్తకాలు అందిస్తున్నాం. గత పాలకులు చేసిన తప్పును సరిదిద్దుతూ ప్రభుత్వమే ఉచితంగా పట్టాలు ఇస్తోంది. రిజిస్ట్రేషన్ విధానం కూడా సులభతరం చేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.