
జనం న్యూస్ : తెలంగాణలోని విద్యార్థినిలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపికబురు చెప్పారు. ఎన్నికల హామీ మేరకు త్వరలోనే ఈ ఉచిత స్కూటీల పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ పథకంకు సంబంధించి విధివిధానాలపై అధ్యయనం చేస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ సిటీలు ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులు సమీప భవిష్యత్తులో హైదరాబాద్‌కు తలెత్తకుండా నివారించడంతో పాటు ఈ నగరాన్ని ప్రపంచంలోనే మేటి నగరాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాలుష్య నియంత్రణలో భాగంగా హైదరాబాద్‌లో తిరిగే ఆర్టీసీ బస్సులను 2026 డిసెంబర్ 9 నాటికి వంద శాతం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టబోతున్నామని సీఎం చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జ్యోతిరావు పూలే భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మహిళా జర్నలిస్టులను సత్కరించారు. విద్యార్థినిలకు ఉచిత స్కూటీలు మరోవైపు మహిళా సాధికారతపై సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఎన్నికల హామీ మేరకు త్వరలోనే ఈ ఉచిత స్కూటీల పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని, డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు, గృహలక్ష్మి పథకం ద్వారా సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అందిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని గుర్తు చేశారు. ఇప్పుడు విద్యార్థినులకు ఉచిత స్కూటీలు ఇవ్వడం ద్వారా వారి విద్యకు, స్వావలంబనకూ మరింత తోడ్పాటు లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 500 ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టాం ‘కాలుష్య నివారణలో భాగంగా 2026 డిసెంబర్ 9 నాటికి హైదరాబాద్‌లో ఆర్టీసీ ద్వారా వంద శాతం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతాం. ప్రస్తుతం ఆర్టీసీలో 2800 బస్సులు డీజిల్‌తో నడుస్తున్నాయి. కాలుష్య నియంత్రణలో భాగంగా వాటి స్థానంలో 500 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాం. డీజిల్ వాహనాలను ఓఆర్ఆర్ అవతలి ప్రాంతాలకు తరలించి వాటి స్థానంలో డిసెంబర్ నూటిని నూరు శాతం ఈవీ బస్సులను ప్రవేశపెడుతాం. ఈవీ వాహనాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈవీ వాహనాలకు జీరో పన్ను పాలసీ తెచ్చాం. నగరంలో 2 లక్షల ఆటోలున్నాయి. డీజిల్, పెట్రోల్ ఇతర ఇంధన ఆధారంగా నడుస్తున్న ఈ ఆటోలను రెట్రోఫిటింగ్ కింద ఈవీలుగా మార్చాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సింగల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నాం. నగరంలో కాలుష్య కారక రెడ్, ఆరెంజ్ కేటగిరీలోని పరిశ్రమలను నగరం అవతలి వైపునకు తరలిస్తున్నాం’అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.