
పయనించే సూర్యుడు న్యూస్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీలో పర్యటించనున్నారు. రైసినా డైలాగ్ 2026 సదస్సుకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. సాంకేతికత- సుపరిపాలనపై సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ఇకపోతే ఈ సదస్సుకు 110 దేశాలకు చెందిన 2,700 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారు అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ప్రతిష్టాత్మక ‘రైసినా డైలాగ్ 2026’ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం హాజరుకానున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో సాంకేతికత - సుపరిపాలన, భవిష్యత్ అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఉపన్యాసం చేయనున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ- అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక సదస్సును నిర్వహిస్తున్నాయి. ఇందులో పాల్గొనేందుకు శనివారం ఉదయం 10.50 గంటలకు సీఎం విజయవాడ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. మద్యాహ్నం 2 గంటలకు తాజ్ ప్యాలెస్ లో జరిగే రైసినా డైలాగ్ 2026 సదస్సుకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం ఆయన అమరావతి తిరిగి రానున్నారు. 2016 నుంచి ఎంఓఈఏ- ఓఆర్ఎఫ్ సంస్థలు రైసినా డైలాగ్ పేరిట ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. 2700 మంది ప్రతినిధుల హాజరు ప్రపంచ రాజకీయాలు- అంతర్జాతీయంగా మారుతున్న ఆర్ధిక వ్యవస్థపై ప్రపంచ స్థాయిలో చర్చించే అత్యున్నత వేదికగా రైసినా డైలాగ్ సదస్సుకు మంచి పేరుంది. వివిధ దేశాల అధినేతలు, మంత్రులు, అత్యున్నత సైనిక అధికారులు, విధానకర్తలు, మేధావులు, నిపుణులు ఒకే వేదికపై గ్లోబల్ వ్యూహాలను చర్చించేలా ఈ సదస్సు జరగనుంది. అంతర్జాతీయంగా పేరొందిన మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్సు లాంటి ప్రతిష్టాత్మక వేదికల సరసన రైసినా డైలాగ్ నిలుస్తోంది. ఈ ఏడాది జరగనున్న 11వ ఎడిషన్ రైసినా డైలాగ్ సదస్సు సంస్కార- అన్వేషణ, సమన్వయం, పురోగతి అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. 110 దేశాలకు చెందిన 2,700 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ రైసినా డైలాగ్ సదస్సులో కీలకోపన్యాసం చేస్తారు. సుపరిపాలన డిజిటల్ అంశాలపై చంద్రబాబు ప్రసంగం దేశంలో అభివృద్ధి పథాన నడుస్తున్న రాష్ట్రంగా ఏపీలో అమలు చేస్తున్న సుపరిపాలన- డిజిటల్ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో వివరించనున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్, డేటా ఆధారిత విధాన నిర్ణయాల ద్వారా ప్రజలకు అందుతున్న మెరుగైన పౌరసేవల గురించి ఈ సదస్సులో ప్రస్తావించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ ఆవిష్కరణల కేంద్రంగా, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్ డెస్టినేషన్‌గా మార్చేందుకు అనుసరిస్తున్న దార్శనిక నిర్ణయాలను ప్రపంచ దేశాల ముందు ఉంచనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకోసిస్టమ్స్, డేటా సెంటర్లు, క్లీన్, గ్రీన్ ఎనర్జీ, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ కారిడార్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి తన ప్రసంగంలో వివరించనున్నారు. పాలనకు సాంకేతికతను జోడించి ఆర్ధిక వృద్ధిని ఎలా వేగవంతం చేయవచ్చన్న అంశాలతో పాటు పాలనలో పారదర్శకత, సంపద సృష్టి, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ వంటి వినూత్న అంశాలపై అంతర్జాతీయ ప్రతినిధులతో తన అనుభవాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంచుకోనున్నారు.