
పయనించే సూర్యుడు న్యూస్ : బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పులు కుట్టుకునే వారిని చెప్పులు కుట్టుకోమని చెప్పింది. కానీ ఈ ప్రజాప్రభుత్వం మాత్రం ఈ జాతి ఈ రాజ్యాన్ని నడపాలి అని కోరుకుంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావాలి.. తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములు కావాలి.. నా శక్తి ఉన్నంత వరకు మీకు సాయం చేస్తాను అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మహాభారతంలో కర్ణుడు, బర్బరీకుడు అంటే తనకు ఎంతో ఇష్టం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణుడిలా మాదిగల విషయంలో మిత్రధర్మం పాటిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. మిత్రుడి కోసం చివరి ఊపిరి వరకు కర్ణుడు నిలబడ్డాడని...తాను కూడా మిత్ర ధర్మానికి కట్టుబడి మాదిగల వెంట నిలబడుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మాదిగ ఎంప్లాయిస్ కో ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఎస్సీ వర్గీకరణ సాధించేందుకు చాలా మంది పోరాడి ప్రాణాలు కోల్పోయారని సీఎం గుర్తు చేశారు. రిజర్వేషన్ల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడారు అని చెప్పుకొచ్చారు. ప్రజా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి మీ సమస్యను చూస్తూనే ఉన్నాను అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ చేశాం 2023 ఎన్నికల్లో ప్రజలు ఇష్టపడి ప్రజా ప్రభుత్వాన్ని ఏరికోరి తెచ్చుకున్నారని...ప్రజలు తమపై పెట్టిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ న్యాయమైన హక్కును సాధించడానికి మీతోపాటు నిలబడ్డాను అని అన్నారు. ఎస్సీ కులాల వర్గీకరణకు సభలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపించిన అంశాన్ని గుర్తు చేశారు. అంతేకాదు ఎస్సీ వర్గీకరణ చేసిన మెుదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని సమస్యలకు వర్గీకరణ పరిష్కారం కాకపోవచ్చు కానీ మీ సమస్యలు పరష్కరించేటప్పుడు అడ్డుకునేవారిని మీరే నిలువరించాలి అని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. విద్యకోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నాం ఎస్సీ వర్గీకరణతో మాదిగ సామాజిక వర్గం ఇప్పుడిప్పుడే లబ్ధిపొందుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బాధ్యతతో వ్యవహరిస్తే మీ జాతికి న్యాయం జరుగుతుంది. ప్రగతి ప్రణాళికలో నిర్లక్ష్యంగా ఉండొద్దు అని మాదిగ ఎంప్లాయిస్ అసోషియేషన్‌కు సూచించారు. ఎస్సీ,ఎస్టీలకు సంక్షేమ పథకాలు అందించాలన్నదే ప్రజాప్రభుత్వం లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మరోవైపు చదువు ఒక్కటే ప్రజలకు ఇవ్వగలిగే ఆస్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్య కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వ ప్రణాళికలను అమలు చేసేది మీరే అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. నాణ్యమైన విద్య కోసం ప్రణాళికలు రచిస్తున్నాం.. ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు కాస్మోటిక్ , డైట్ ఛార్జీలు పెంచాం.. అవకాశం వస్తే పది మందికి సాయం చేస్తారనే మంచి పేరు మీరు, నేను తెచ్చుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాదిగలు కలెక్టర్లు కావాలి గత ప్రభుత్వం బర్రెలు, గొర్రెలు, చేపలు ఇచ్చింది..చెప్పులు కుట్టుకొమ్మని చెప్పింది.. బర్రెలు, గొర్రెలు , చేపలు కాదు... చెప్పుకుట్టుకున్న జాతి ఈ రాజ్యాన్ని నడపాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావాలి.. తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములు కావాలి.. నా శక్తి ఉన్నంత వరకు మీకు సాయం చేస్తాను అని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీరాకుమార్ ఎలా పనిచేశారో అలాంటి స్పూర్తితో పనిచేస్తా.. ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు రేవంత్ మాదిగ, బీసీలు రేవంత్ యాదవ్, వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తే రేవంత్ ముదిరాజ్ అని, సిక్కులు సర్దార్ రేవంత్ అని అసదుద్దీన్‌కు సాయం చేశానని రేవంతుద్దీన్ అని నన్ను అన్నారు.. ఎలా పిలిచినా ఇబ్బంది లేదు.. నేను అందరి వాడినిని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు పరిమితంగా ఉంది మరోవైపు తెలంగాణలో ప్రతి నెల 1000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. నెలకు రూ.1000 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తోంది.. అయినా సమన్వయం చేసుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులదే అని చెప్పుకొచ్చారు. గతంలో జాగీరుదారులు, జమీందార్ల దగ్గర వేలాది ఎకరాల భూములు ఉండేవి. అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుంది. పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవు.. ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు పరిమితంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.