
పయనించే సూర్యుడు న్యూస్ : ప్రజాప్రభుత్వం మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం రెండుసార్లు ప్రజల్లోకి వెళ్లింది. 2023లో ప్రజాపాలన, గ్రామ,వార్డు సభలను నిర్వహించింది. ఆ తర్వాత 2025 ప్రారంభంలో కూడా మరోసారి ప్రజాపాలన, గ్రామ,వార్డు సభలను నిర్వహించి ప్రజల్లోకి వెళ్లింది. తాజాగా మూడోసారి కూడా ప్రజల్లోకి వెళ్లనుంది.ఈసారి 99 రోజులపాటు పది థీమ్స్‌తో ప్రజల్లోకి వెళ్లనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటికే రెండుసార్లు ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన గ్రామసభలు, వార్డు సభలతో నేరుగా ప్రజల వద్దకు వెళ్లింది. ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారి నుంచి అర్జీలు స్వీకరించటంతో పాటు ప్రజలతో నేరుగా మాట్లాడి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. రెండు విడతల్లోనూ ప్రజల సమక్షంలో వచ్చిన అర్జీలతోనే ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసింది. అక్కడ తీసుకున్న అర్జీల ఆధారంగానే రైతు రుణమాఫీ, రైతు భరోసా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 కు గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, కళ్యాణలక్ష్మి, షాధీ ముబారక్, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ. సన్న బియ్యం పంపిణీ, సన్న వడ్లకు రూ.500 బోనస్ పథకాలను అమలు చేసింది.తాజాగా ఇప్పుడు మూడోసారి ‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణకు నడుం బిగించింది. పౌర సేవలు, ప్రజల అవసరాలతో మమేకమై ఉండే అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక కార్యక్రమాలు తలపెట్టింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అయిదు స్థాయిల్లో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపడుతోంది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజల్లోనే... మార్చి 6 నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో పారిశుధ్యంతో పాటు పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయనుంది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముందస్తు ఉత్సవంగా ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను ఇందులో భాగస్వాములను చేసింది.గ్రామ సభలు, వార్డు సభల నిర్వహణతో పాటు మండల కేంద్రాలు, పట్టణ కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో సరికొత్త కార్యాచరణకు నడుం బిగించింది. మండలాలు, జిల్లా కేంద్రాల్లో వివిధ శాఖల అధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనుంది. అన్ని స్థాయిల్లోనూ గ్రామ సర్పంచి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసేలా మార్గదర్శకాలను రూపొందించింది. 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు రెండేండ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, వాటితో లబ్ధి పొందిన కుటుంబాలు, లబ్ధి పొందిన వర్గాలకు చేసిన మేలును క్షేత్ర స్థాయిలో చెప్పుకోవటంతో పాటు.. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు తప్పకుండా అందించాలనే సంకల్పంతో ఈ సభలను ఏర్పాటు చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో వస్తున్న సంస్కరణలు, వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటళ్లను తీర్చిదిద్దే ప్రణాళికను ప్రజలకు వివరించనుంది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించే 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను గుర్తించి, పిల్లల తల్లితండ్రుల్లో అవగాహన పెంచనుంది. లక్షమంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యం విద్యుత్తు డిమాండ్‌కు అనుగుణంగా పునరుత్పాదక విద్యుత్తు, ప్రధానంగా సోలార్ విద్యుత్తు వినియోగం పెంచటం, సోలార్ విద్యుత్తు ఉత్పత్తి ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ఉన్న మార్గాలను ప్రజలకు, రైతులకు తెలియజేయాలనేది లక్ష్యంగా ఎంచుకుంది. ఖాళీ స్థలముండి ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలనే ప్రజా ప్రభుత్వ లక్ష్యాన్ని నూటికి నూరు పాళ్లు అమలయ్యేలా చూడాలని సంకల్పించింది. పదేండ్లుగా ఇవ్వని రేషన్ కార్డులను.. అర్హులైన వారందరికీ ఇవ్వాలని, ఇదో నిరంతర ప్రక్రియగా అమలు చేయాలని నిర్ణయించింది. యువతకు నైపుణ్యాల శిక్షణతో పాటు ఉపాధి కల్పించే కార్యక్రమాలు 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో చేపట్టనుంది. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహించి.. లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనేది టార్గెట్‌గా ఎంచుకుంది. ఇందిరా మహిళా శక్తి సాధిస్తున్న విజయాలను, కొత్తగా వ్యాపారాభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించనుంది. అన్ని జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనాలను ప్రారంభించనుంది. 1వ వారం – గ్రామీణ అభివృద్ధి(మార్చి 30 నుండి ఏప్రిల్ 4 ) 2వ వారం – ఆరోగ్య రంగం(ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 11) 3వ వారం – Arrive-Alive( ఏప్రిల్13 నుండి ఏప్రిల్ 18) 4వ వారం – సంక్షేమం(ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 25 వరకు) 5వ వారం – పిల్లల భద్రత, డ్రగ్స్ అడ్డుకట్ట (ఏప్రిల్ 27 నుండి మే2) 6వ వారం – రైతు సంక్షేమం(మే 4 నుండి మే 9 వరకు) 7వ వారం – విద్య(మే 11 నుండి మే 16 వరకు) 8వ వారం – యువత, క్రీడలు (మే 18 నుండి మే 23 వరకు) 9వ వారం – మహిళా సంక్షేమం( మే 25 నుండి మే 30 ) 10వ వారం – పర్యావరణం( జూన్1 నుండి జూన్ 6)